Punjab Polls: పంజాబ్‌ సీఎం రెండు చోట్లా ఓడిపోతారు : కేజ్రీవాల్‌

పంజాబ్‌ సీఎం రెండు చోట్లా ఓడిపోతారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ పేర్కొన్నారు.

Published : 13 Feb 2022 15:17 IST

ఇసుక మైనింగ్‌లో సీఎం ప్రమేయంపై మండిపడ్డ ఆప్‌ కన్వీనర్‌

అమృత్‌సర్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అక్కడి అధికార కాంగ్రెస్‌కు ప్రధాన పోటీగా తయారైన ఆమ్‌ఆద్మీ పార్టీ చన్నీ ప్రభుత్వానికి సవాల్‌ విసురుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ సీఎం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడాన్ని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రచారాస్త్రంగా మలచుకుంటోంది. తాజాగా పంజాబ్‌ సీఎం రెండు చోట్లా ఓడిపోతారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ పేర్కొన్నారు. తాము మూడోసారి నిర్వహించిన టెలిఫోనిక్‌ సర్వేలో ఇదే విషయం తేలిందని స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా అమృత్‌సర్‌లో పర్యటించిన కేజ్రీవాల్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

‘ముఖ్యమంత్రి చన్నీ సాహెబ్‌ ఈసారి ఎన్నికల్లో చామ్‌కౌర్‌, భదౌర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. మేం మూడుసార్లు జరిపిన సర్వేలో సీఎం చన్నీ రెండుచోట్లా ఓడిపోనున్నట్లు తేలింది. ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోతే.. ఇక ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికవుతారు..?’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఇక సీఎం పోటీ చేస్తున్న చామ్‌కౌర్‌ నియోజకవర్గంలో ఆమ్‌ఆద్మీ పార్టీ 52శాతం ఓట్లు పొందనుందని.. భదౌర్‌లో తమ పార్టీకి 48శాతం ఓట్లు లభిస్తాయని భరోసా వ్యక్తం చేశారు.

ఇక పంజాబ్‌ సీఎం చన్నీపై వస్తోన్న ఇసుక మైనింగ్‌ ఆరోపణలపై కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఇప్పటికే చన్నీ బంధువు వద్ద దొరికిన డబ్బంతా సీఎందేనని నిందితుడు అంగీకరించినప్పటికీ ఈడీ ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ మైనింగ్‌ విషయంలో పంజాబ్‌ సీఎంపై వస్తోన్న ఆరోపణలను ఆయన స్వయంగా దర్యాప్తు జరపలేరని.. ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము నిష్పాక్షిక దర్యాప్తు చేస్తామని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని