kishan reddy: భాజపా రాష్ట్ర కార్యాలయంలో దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి

 కేంద్రమంత్రి, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో దీక్ష విరమించారు.

Updated : 14 Sep 2023 14:12 IST

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో దీక్ష విరమించారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ నిమ్మరసం ఇచ్చి ఆయన చేత దీక్షను విరమింపజేశారు. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై బుధవారం కిషన్‌రెడ్డి ఇందిరా పార్కు వద్ద 24 గంటల దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల సమయంలో పోలీసులు ఆ ప్రాంగణాన్ని చుట్టుముట్టి ఆయన్ని బలవంతంగా భాజపా రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. ధర్నాచౌక్‌ వద్ద జరిగిన తోపులాటలో కిషన్‌రెడ్డి చేతికి, ఛాతికి గాయాలు కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మరోసారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరీక్షించారు.

రాబోయే వంద రోజుల్లో మరిన్ని పోరాటాలు : ప్రకాశ్‌ జావడేకర్‌

నిరుద్యోగుల తరఫున పోరాటం చేసేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు. దీక్ష నేపథ్యంలో భాజపా కార్యకర్తలు చూపిన తెగువను ఆయన అభినందించారు. ఇప్పటికే వివిధ సందర్భాల్లో భాజపా సత్తా ఏంటో సీఎం కేసీఆర్‌కు చూపించామని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి శాంతియుతంగా ధర్నా చేసినా అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. తెలంగాణ యువతను మోసం చేశాననే విషయం కేసీఆర్‌కు తెలుసు కాబట్టే.. భయంతో పోలీసులను పంపించారని దుయ్యబట్టారు. రాబోయే వంద రోజుల్లో కేసీఆర్ అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని