Maharashtra: ప్రభుత్వం నుంచి భాజపా అభ్యర్థి.. ఎంవీఏ నుంచి శివసేన నేత..!

మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ శిందే నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం బలపరీక్షకు సిద్దమవుతోంది.

Published : 02 Jul 2022 14:22 IST

స్పీకర్‌ పదవికి బరిలో 

ముంబయి: మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ శిందే నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం బలపరీక్షకు సిద్దమవుతోంది. దానిలో భాగంగా రేపటి నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అలాగే స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. ఆ పదవి  కోసం ప్రభుత్వం తరఫు నుంచి భాజపా ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ బరిలో ఉండగా.. మహా వికాస్ అఘాడీ నుంచి శివసేన ఎమ్మెల్యే రాజన్ సల్వి పోటీలో నిలిచారు. ఆయన ఈ రోజు నామినేషన్ వేశారు. రేపు దీనిపై ఓటింగ్ జరగనుంది. 

సోమవారం కొత్త ప్రభుత్వం బలపరీక్షను నిరూపించుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో గోవాలోని అసమ్మతి ఎమ్మెల్యేలు ఈ రోజు ముంబయికి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోవాలోనే ఉన్న ముఖ్యమంత్రి శిందే వెంట వారంతా రానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శిందే సహా కొంతమంది రెబెల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత విషయం తేలే వరకూ వారిని అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్‌ చేయాలని కోరుతూ శివసేన చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు పిటిషన్‌ దాఖలు చేశారు. రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌తో పాటు 11న ఈ కేసు విచారణను చేపడతామని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జె.బి.పర్దివాలా ధర్మాసనం పేర్కొంది.

ఇదిలా ఉండగా.. శిందేను శివసేన పార్టీలో అన్ని పదవుల నుంచి పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే శుక్రవారం తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను ఆయనను తొలగిస్తున్నట్లు పేర్కొంటూ ఠాక్రే లేఖ రాశారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. శిందే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తేదీ (జూన్‌ 30)తోనే లేఖను పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని