Mamata: ఇంకా వస్తారు.. వాళ్లను మాత్రం తీసుకోం! 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడి, తీవ్ర పదజాలంతో దూషించి తమకు ద్రోహం చేసిన వాళ్లను తిరిగి టీఎంసీలోకి తీసుకోబోమని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి .....

Published : 11 Jun 2021 18:36 IST

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడి, తీవ్ర పదజాలంతో దూషించి తమకు ద్రోహం చేసిన వాళ్లను తిరిగి టీఎంసీలోకి తీసుకోబోమని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌, ఆయన తనయుడు సుభ్రాంశురాయ్‌ శుక్రవారం సాయంత్రం మమతా బెనర్జీ సమక్షంలోనే సొంతగూటికి చేరారు. ఈ సందర్భంగా దీదీ మీడియాతో మాట్లాడుతూ.. ముకుల్‌ రాయ్‌కి స్వాగతం చెబుతున్నామన్నారు. ఆయన ఎప్పుడూ టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. భాజపాలో ఆయన్ను బెదిరించారని, అదే ఆయన అనారోగ్యానికి దారితీసిందన్నారు. టీఎంసీ ఎలాంటి కుంభకోణాలూ చేయలేదని.. భాజపా ఎందుకు బీటలు వారుతోందో వారినే అడగాలని సూచించారు.  ఎన్నికలకు ముందు భాజపాలో చేరిన వాళ్లను తృణమూల్‌లోకి తీసుకోబోమని,  పార్టీలో ముకుల్‌ రాయ్‌ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు.

ముకుల్‌ను తమ పాత కుటుంబ సభ్యుడిగా పేర్కొన్న మమత.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నారు. టీఎంసీ ఇప్పటికే బలమైన పార్టీ అని చెప్పారు. ముకుల్‌ రాయ్‌ని భాజపాలో బెదిరించారని,  ప్రస్తుత నిర్ణయం ఆయనకు మానసిక ఉపశమనం ఇస్తుందని భావిస్తున్నట్టు దీదీ పేర్కొన్నారు. భాజపాను వీడి ముకుల్‌ రాయ్‌ తిరిగి తమ పార్టీలోకి రావడం.. మరింత మంది కూడా వస్తారనేందుకు ఓ సంకేతమన్నారు. పార్టీని వీడిన అనంతరం తమ పట్ల పరుష పదజాలంతో దూషించిన వారిని మాత్రం తీసుకొనే ప్రసక్తే లేదన్నారు. సౌమ్యంగా వ్యవహరించిన వారిని మాత్రం తీసుకొనే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. 

బెంగాల్‌ భాజపాలో ఎవరూ ఉండలేరు

మరోవైపు, భాజపాను వీడి సొంత గూటికి రావడం, పాత మిత్రులను చూడటం ఆనందంగా ఉందని ముకుల్‌ రాయ్‌ అన్నారు. తాను భాజపాలో ఉండలేకపోయానన్నారు. మమతను యావత్‌ దేశానికి నాయకురాలిగా అభివర్ణించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బెంగాల్‌ భాజపాలో ఎవరూ ఉండలేరని ఆయన వ్యాఖ్యానించారు. కొన్నేళ్ల క్రితం మమతపై విమర్శలు చేయడంపై మీడియా ముకుల్‌రాయ్‌ని ప్రశ్నించగా.. దీదీతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. అనంతరం జోక్యంచేసుకున్న మమత.. విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించొద్దంటూ విలేకర్లతో అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని