icon icon icon
icon icon icon

అక్రమాలపై ‘అనంత’ గర్జన

అనంతపురం జిల్లాలో ఈసారి అధికార వైకాపా ‘ఎత్తిపోతాది’ అని జనం గళమెత్తుతున్నారు. జిల్లాలో ఏదో ఒక చోట అధికార పార్టీ నేతలు నిత్యం చేసే అరాచకాలు, ఎమ్మెల్యేలపై అవినీతి, అక్రమాల ఆరోపణలతో విసుగు చెందిన ప్రజలు మార్పునకు జై కొడుతున్నారు. వైకాపాకు అంతటా ఎదురుగాలి వీస్తోంది.

Updated : 07 May 2024 06:08 IST

ఐదేళ్లలో అధికార పార్టీ అరాచకాలపై అనంతపురం జిల్లా వాసుల అసంతృప్తి
రౌడీ రాజ్యం పోవాలని కోరుకుంటున్న ఓటర్లు
ఐదు అసెంబ్లీ స్థానాల్లో తెదేపా ముందంజ
రెండు చోట్ల పోటాపోటీ
అనంతపురం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

అనంతపురం జిల్లాలో ఈసారి అధికార వైకాపా ‘ఎత్తిపోతాది’ అని జనం గళమెత్తుతున్నారు. జిల్లాలో ఏదో ఒక చోట అధికార పార్టీ నేతలు నిత్యం చేసే అరాచకాలు, ఎమ్మెల్యేలపై అవినీతి, అక్రమాల ఆరోపణలతో విసుగు చెందిన ప్రజలు మార్పునకు జై కొడుతున్నారు. వైకాపాకు అంతటా ఎదురుగాలి వీస్తోంది. ఈ జిల్లా ప్రధానంగా సాగునీటి సమస్యను ఎదుర్కొంటోంది. దీన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం కనీస చొరవ చూపలేదు. హంద్రీనీవా జలాలను జిల్లాకు అందకుండా చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు జిల్లాలో అపార అవకాశాలున్నా జగన్‌ సర్కారు ఆ దిశగా కనీసం ఆలోచించలేదు. సర్కారుపై వ్యతిరేకత, వైకాపా ఎమ్మెల్యేల అక్రమాలు, దౌర్జన్యాలతో తటస్థ ఓటర్లు తెదేపా వైపు మొగ్గు చూపుతున్నారు. అనంతపురం లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ఈనాడు’ ప్రతినిధి పర్యటనలో ఓటర్లు కోరుకుంటున్న మార్పు కనిపించింది. తాజా పరిస్థితుల ప్రకారం అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రాయదుర్గం, శింగనమల, ఉరవకొండ, తాడిపత్రి, అనంతపురం అసెంబ్లీ స్థానాల్లో తెదేపా ముందంజలో ఉంది. గుంతకల్లు, కళ్యాణదుర్గంలో ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. అనంతపురం లోక్‌సభ తెదేపా అభ్యర్థిగా బోయ సామాజికవర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ బరిలో నిలిచి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలే తన విజయ సోపానాలని ఆయన చెబుతున్నారు. వైకాపా తరఫున పెనుకొండ సిటింగ్‌ ఎమ్మెల్యే, కురబ సామాజికవర్గానికి చెందిన శంకరనారాయణ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ స్థానాల్లో తాజా రాజకీయ పరిస్థితులివి.


రాయదుర్గం.. సైకిల్‌ బాట

కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాల్లో ఒకటైన రాయదుర్గంలో తెదేపా అభ్యర్థిగా మూడోసారి కాలవ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. వైకాపా నుంచి మెట్టు గోవిందరెడ్డికి సీటు దక్కింది. సిటింగ్‌ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని ఆ పార్టీ పక్కనబెట్టింది. ఆయన భాజపాలో చేరారు. కాలవ శ్రీనివాసులు 2014లో ఇక్కడినుంచి గెలిచి మంత్రిగా సేవలందించారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా ఆయన ఐదేళ్లుగా నియోజకవర్గంతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ అధికార పార్టీ అవినీతి, అరాచకాలపై పోరాడారు. మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు, రహదారి నిర్మాణంలాంటి ప్రగతి పనులు చేయించారు. తరువాత వైకాపా ప్రభుత్వం ఏమీ చేయలేదన్న అభిప్రాయం ఓటర్లలో వ్యక్తమైంది. ‘వ్యక్తిగతంగా ప్రయోజనం పొందితే చాలని 10, 15 శాతం మందే ఉంటారు. మిగిలిన వారందరూ ఎంతో కొంత నియోజకవర్గం, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న భావనతో ఉంటారు’ అని రాయదుర్గం వాసి, ఐటీ ఉద్యోగి ఒకరు అభిప్రాయపడ్డారు. ‘2019లోనే పట్టణంలోని అంతర్గత రోడ్ల పనులు 70 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఇప్పటికీ చేయలేదు. తెదేపాకు పేరు వస్తుందని కొన్ని పనులనూ పూర్తి చేయలేదు’ అని ఓ యువకుడు వాపోయారు. ‘మాకు కొన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాకపోతే తెదేపా మ్యానిఫెస్టో మరింత లబ్ధి చేకూర్చేలా ఉంది. అందుకే మార్పు కోరుకుంటున్నా’ అని రాయదుర్గం సమీపంలోని ఓ గ్రామంలో ఇస్త్రీ చేసే యువకుడు చెప్పారు. వైకాపా నుంచి తెదేపాలో చేరికలు ప్రస్తుతం భారీగా ఉన్నాయి.


శింగనమలలో తెదేపా జోరు

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన శింగనమలలో ఈసారి తెదేపా జోరుమీద ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన బండారు శ్రావణికే తెదేపా అవకాశమిచ్చింది. 2019 ఎన్నికల్లో వైకాపా నుంచి జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. ఆమె పేరుకే ఎమ్మెల్యే... భర్త సాంబశివారెడ్డిదే పెత్తనం. ఆయన తన కుటుంబీకులు ఒక్కొక్కరికి ఒక్కో మండలంపై పెత్తనమిచ్చారన్న విమర్శలున్నాయి. భూముల దందా సాగించినట్లు ఆరోపణలొచ్చాయి. ఎస్సీ ఎమ్మెల్యే అయినా తమకు ఏమీ చేయలేదన్న ఆవేదన ఆ వర్గంలో వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే, ఆమె భర్తపై పార్టీలోనే అసమ్మతి కనిపించింది. దీంతో ఈసారి అభ్యర్థిని మార్చి కొత్తగా మన్నెపాకుల వీరాంజనేయులుకు వైకాపా టికెట్‌ ఇచ్చింది. ఆయన గెలుపు బాధ్యతను వైకాపా అధిష్ఠానం మళ్లీ సాంబశివారెడ్డికే అప్పగించింది. ఆయనకు పార్టీలోని కొన్ని గ్రూపులు సహకరించబోవని ప్రచారమవుతోంది. ఇది తెదేపాకు కలిసిరానుంది. గత ఎన్నికల్లో ఓడినప్పటికీ శ్రావణి నియోజకవర్గంలో ప్రజల వెంట నడుస్తూ చేరువయ్యారు.


కళ్యాణదుర్గంలో ఉత్కంఠ పోరు

తెదేపాకు పట్టున్న స్థానాల్లో ఇదొకటి. ప్రముఖ కాంట్రాక్టరు అమిలినేని సురేంద్రబాబుకు పార్టీ టికెట్‌ దక్కింది. 2019లో వైకాపా నుంచి గెలిచిన ఉష శ్రీచరణ్‌పై అవినీతి, అక్రమాల ఆరోపణలున్నాయి. అప్పులిచ్చిన వారినే పోలీసు కేసులతో వేధించారన్న విమర్శలొచ్చాయి. ఫలితంగా ఆమెకు ఇక్కడ టికెట్‌ దక్కలేదు. ఆ పార్టీ అనంతపురం సిటింగ్‌ ఎంపీ తలారి రంగయ్య బరిలో నిలిచారు. తొలి నుంచి తెదేపా టికెట్‌ కోసం మాదినేని ఉమామహేశ్వరనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి పోటీపడ్డారు. దాంతో అప్పటికే జిల్లాలో సేవా కార్యక్రమాలతో జిల్లావాసులకు సుపరిచితుడైన సురేంద్రబాబును తెదేపా బరిలో నిలిపింది. కరోనా సమయంలో వేల మందిని ఆయన ఆదుకున్నారు. ఈ పరిణామాలతో ఉమామహేశ్వరనాయుడు వైకాపాలో చేరారు. పార్టీకి పట్టు ఉండటంతో సురేంద్రబాబు ప్రచారంలో దూసుకెళుతున్నారు. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి హంద్రీనీవా జలాలను రెండేళ్లలో ఇక్కడికి రప్పిస్తానని హామీనిస్తున్నారు. అధికార పార్టీపై రైతుల్లో వ్యతిరేకత ఉండటంతోపాటు సురేంద్రబాబు కాంట్రాక్టరు కావడం వల్ల కాలువల పనులు త్వరగా చేయిస్తారన్న నమ్మకాన్ని రైతులు వ్యక్తం చేశారు. ‘ఇక్కడ వ్యవసాయంకంటే కూలికి వెళితేనే జీవనం సాఫీగా ఉంటుంది’ అని చాపిరి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు. నియోజకవర్గంలో బోయ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. ‘మా కుటుంబీకులకు కొన్ని పథకాల లబ్ధి అందుతోంది. నేను మాత్రం కానిస్టేబుల్‌, డీఎస్సీకి సిద్ధమవుతున్నా. అందుకే నా భవిష్యత్తు కోసం  మార్పు కోరుకుంటున్నా..’ అని కళ్యాణదుర్గం పట్టణం దొడగట్టకు చెందిన యువకుడు ఒకరు చెప్పారు. ‘నేను రోజూ మందు తాగుతా. ఇప్పుడు దొరుకుతున్న మద్యంతో ఆరోగ్యం గుల్లవుతోంది. అందుకే వైకాపాకు గుడ్‌బై చెబుతున్నా’ అని మరో ప్రైవేటు ఉద్యోగి వ్యాఖ్యానించారు. మరోవైపు ఎంపీగా రంగయ్య నియోజకవర్గానికి వచ్చింది లేదు.. చేసిందేమీ లేదన్న విమర్శ ఉంది.


ఉరవకొండ.. రగులుతున్న రైతులు

అనంతపురం లోక్‌సభ పరిధి ఉరవకొండ నియోజకవర్గంలో మాత్రమే గత ఎన్నికల్లో తెదేపా గెలిచింది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఏడోసారి పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటివరకు నాలుగు సార్లు గెలుపొందగా.. రెండు సార్లు ఓడిపోయారు. వైకాపా నుంచి మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తలపడుతున్నారు. ఈసారి ఈ నియోజకవర్గం రైతుల్లో అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. హంద్రీనీవా ప్రధాన కాలువ తమ నియోజకవర్గంనుంచి పోతున్నా ప్రభుత్వం మాత్రం తమ పొలాలను ఎండబెట్టి ఇతర జిల్లాలకు తరలించిందన్నది వారి వాదన. ‘జగన్‌ అన్ని విధాలా రైతులను ముంచారు. అందుకే ఈసారి పార్టీ ఎత్తిపోతాది’ అని పెద్దముష్ఠూరుకు చెందిన రైతు వ్యాఖ్యానించారు. ‘మా పొలాల పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్‌ ఫొటో ఎందుకు? ఏమీ అడగలేమనే కదా?’ అని వై.రాంపురానికి చెందిన యువ రైతులు ప్రశ్నించారు. మరోవైపు వైకాపా అభ్యర్థి తమ్ముడు మధుసూదనరెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. వైకాపా నేతలతో ఆయనకు విస్తృత సంబంధాలున్నాయి. దాంతో కాంగ్రెస్‌కు పడే ఓట్ల వల్ల వైకాపాకే నష్టమని చెబుతున్నారు. అన్నను ఓడించడమే లక్ష్యంగా మధుసూదనరెడ్డి పోరాడుతున్నట్లు తెలుస్తోంది. 2004 నుంచి ఇక్కడ మెజారిటీ ఎప్పుడూ తొమ్మిది వేలకు మించలేదు. 2004లో 8,255, 2009లో 229, 2019లో 2,132 ఓట్ల ఆధిక్యంతో కేశవ్‌ గెలవగా, 2014లో 2,275 ఓట్ల మెజారిటీతో విశ్వేశ్వరరెడ్డి గెలిచారు.


అనంతపురంలో మార్పు తప్పదా?

అనంతపురం అసెంబ్లీ స్థానంలో గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి ప్రభాకర్‌చౌదరిని ఓడించి అనంత వెంకట్రామిరెడ్డి (వైకాపా) గెలుపొందారు. ఈసారి ఆయనే మరోసారి బరిలో నిలవగా.. తెదేపా మాత్రం రాప్తాడు మాజీ ఎంపీపీ, పారిశ్రామికవేత్త దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ను రంగంలోకి దింపింది. ఐదేళ్లుగా నగరంలో అభివృద్ధి లేదని, దీనికితోడు డంపింగ్‌ యార్డు, భూగర్భ డ్రైనేజీలాంటి హామీలను ఎమ్మెల్యే నెరవేర్చలేదన్న అసంతృప్తి నగర ఓటర్లలో వ్యక్తమైంది. నగరంలో వేల సంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. వారిలో ప్రస్తుత సర్కారుపై వ్యతిరేకత ఉండటం తెదేపా గెలుపునకు దోహదపడనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఏకంగా 23,500 మంది పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. సగం మందికిపైగా నగర ఓటర్లే కావడం గమనార్హం. ‘ఎవరిని అడిగినా ఇక్కడ వైకాపా గెలుస్తుందని చెబుతారు. ఓటు మాత్రం తెదేపాకు వేస్తారు. అధికార బలంతో అంతగా మమ్మల్ని భయపెట్టారు’ అని ఆటో డ్రైవర్లు పలువురు తెలిపారు. రౌడీయిజం, దాడులు, దౌర్జన్యాలపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి అవకాశమిస్తే అభివృద్ధి అంటే చూపిస్తానని తెదేపా అభ్యర్థి వెంకటేశ్వరప్రసాద్‌ హామీలిస్తున్నారు.


తాడిపత్రిలో తెదేపా వైపే మొగ్గు

తాడిపత్రిలో ఈసారి తెదేపాకు సానుకూల వాతావరణం కనిపిస్తోంది. జేసీ కుటుంబానికి ఇక్కడ పట్టు ఉంది. 1985 నుంచి వరుసగా ఆరు సార్లు దివాకరరెడ్డి, ఒకసారి ప్రభాకరరెడ్డి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఇక్కడినుంచి వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపొందారు. అప్పుడు పోటీ చేసి ఓడిన జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డికి తెదేపా మరో అవకాశమిచ్చింది. జగన్‌ సర్కారు అధికారంలో ఉన్నా తాడిపత్రి మున్సిపాలిటీని తెదేపా కైవసం చేసుకోవడం గమనార్హం. ఉత్తమ విధానాలతో ఒకప్పుడు ఎన్నో పురస్కారాలు దక్కించుకున్న ఈ మున్సిపాలిటీ ఇప్పుడు మురికికూపంగా మారిందన్న విమర్శలున్నాయి. మున్సిపాలిటీ నుంచి ఏదైనా చేద్దామన్నా.. ఎమ్మెల్యే వర్గం మోకాలడ్డుతోందన్న అభిప్రాయం వినిపించింది. దీనిపై పలుమార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. దీనికితోడు గ్రానైట్‌ పరిశ్రమ కోలుకోలేనట్లుగా దెబ్బతింది. సర్కారు విధానాలతోపాటు ముఖ్యప్రజాప్రతినిధి మామూళ్ల వేధింపులతో వందల సంఖ్యలో పరిశ్రమలు మూతపడ్డాయి. వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారి ఓట్లు 20 వేల వరకున్నాయి. ఈ ప్రభావం ఎన్నికల్లో తప్పక ఉంటుందని భావిస్తున్నారు. ఒకసారి ఓడిపోయిన తెదేపా అభ్యర్థి అస్మిత్‌రెడ్డిపై ఓటర్లలో సానుభూతి వ్యక్తమవుతోంది.


గుంతకల్లు.. అభివృద్ధి నిల్లు

గుంతకల్లు నియోజకవర్గం నుంచి అనూహ్యంగా తెదేపా అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం బరిలోకి దిగారు. 2019 ఎన్నికల్లో ఆలూరు నుంచి గెలిచిన ఆయన మంత్రిగా పనిచేసి రాజకీయ పరిణామాల క్రమంలో తెదేపాలో చేరారు. గుంతకల్లులో బోయ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు దాదాపు 55 వేల వరకు ఉండటంతో అదే సామాజికవర్గానికి చెందిన జయరాంకు తెదేపా అవకాశమిచ్చింది. సిటింగ్‌ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి చేసిందేమీ లేదన్న భావన ఓటర్లలో ఉంది. దీనికితోడు ఆయన ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదు. హంద్రీనీవా నీరు తెస్తానన్న హామీని విస్మరించడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆసియా ఖండంలోనే పెద్దదైన స్పిన్నింగ్‌మిల్లు తెరిపిస్తానన్న హామీ గాల్లో కలిసింది. ఎమ్మెల్యే బంధువులు ఇసుక, మట్టి మాఫియాలో కీలక పాత్రధారులని, కొండలను, గుట్టలను కాజేశారన్న ఆరోపణలున్నాయి. ఓటర్లు ఎక్కువగా ఉన్న గుంతకల్లు పట్టణం గెలుపోటముల్లో కీలకం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img