Nitin Gadkari: ‘ఆ సూట్లు ఏం చేస్తారో?’.. మహా పరిణామాలపై గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

మహారాష్ట్రలో మంత్రి పదవులకు రద్దీ పెరగడంతో.. సూట్లు కుట్టించుకుని సిద్ధంగా ఉన్నవారంతా ఇప్పుడు బాధలో ఉన్నారని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. శిందే ప్రభుత్వంలో అజిత్‌ పవార్‌ చేరికతో భాజపా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొందనే వార్తల వేళ ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

Published : 07 Jul 2023 17:34 IST

నాగ్‌పుర్‌: మహారాష్ట్ర (Maharashtra)లో తాజా రాజకీయ పరిస్థితులపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు ఇప్పుడు బాధగా ఉన్నారని, ఎందుకంటే ఆ పదవులకు రద్దీ ఎక్కువగా ఉందని అన్నారు. మంత్రి పదవి తమదనేని ఆశించిన నేతలకు ఇప్పుడు తాము ‘కుట్టించుకున్న సూట్ల’ను ఏం చేయాలో తెలియడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

నాగ్‌పుర్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ (Nitin Gadkari) ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమకు దక్కిన వాటితో ఎప్పుడూ సంతోషంగా ఉండరని ఆయన అన్నారు. ‘‘నేను అర్హమైన దానికంటే ఎక్కువ పొందాను అని ఓ వ్యక్తి అంగీకరించగలిగితే అప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా, సంతృప్తిగా ఉండగలరు. లేదంటే కార్పొరేటర్లు తమకు ఎమ్మెల్యే పదవి దక్కలేదని, ఎమ్మేల్యేలు తమకు మంత్రి పదవులు రాలేదని బాధపడుతూనే ఉంటారు. ఇప్పుడు  కొందరి పరిస్థితి అలాగే (మహారాష్ట్ర రాజకీయాలను (Maha Politics) ఉద్దేశిస్తూ) ఉంది. మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన వారు ఇప్పుడు బాధగా ఉన్నారు. ఎందుకంటే ఆ పదవులు దక్కించుకునేందుకు రద్దీ ఎక్కువగా ఉండటంతో తమ వంతు వస్తుందా? రాదా? అని ఆందోళన చెందుతున్నారు. పైగా మంత్రి పదవి ఆశించిన వారు ఇప్పటికే సూట్లు (ప్రమాణస్వీకారం కోసం) కుట్టించుకుని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రద్దీ పెరగడంతో ఆ సూట్లను ఏం చేయాలనే ప్రశ్న మొదలైంది’’ అని గడ్కరీ వ్యాఖ్యానించడంతో సభలోని వారంతా నవ్వులు చిందించారు.

మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ (NCP)లో ఇటీవల చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. అజిత్‌ పవార్‌ (Ajit Pawar) వర్గం ఎన్సీపీని వీడి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరింది. అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన వర్గానికి మంత్రి పదవులు కూడా ఇచ్చేందుకు శిందే ప్రభుత్వం అంగీకరించింది. అయితే శాఖల కేటాయింపుల విషయంలో శిందే (Eknath Shinde) వర్గం, భాజపా (BJP), పవార్‌ వర్గం మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదని సమాచారం. మరోవైపు, ప్రభుత్వంలోకి అజిత్‌ పవార్‌ రాకతో.. మంత్రి పదవుల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శిందే వర్గం, భాజపాలోని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని