YSRCP: వైకాపాకు మరో షాక్‌.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

వైకాపా(YSRCP)కు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Srikrishna Devarayalu) రాజీనామా చేశారు.

Updated : 23 Jan 2024 16:23 IST

నరసరావుపేట: వైకాపా(YSRCP)కు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Srikrishna Devarayalu) రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడారు. కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

వైకాపాలో కొంత అనిశ్చితి ఏర్పడిందని.. దానికి తాను బాధ్యుడిని కాదని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో కార్యకర్తలు కొంత అయోమయానికి గురవుతున్నారని, దానికి తెరదించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నరసరావుపేట లోక్‌సభ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ ఆలోచిస్తోందన్నారు. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని చెప్పారు. 

కొద్దిరోజుల క్రితం సీఎం జగన్‌తో లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఓ ఛానల్‌తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా అభిప్రాయాలతో సీఎం కన్విన్స్‌ అయ్యారని అనుకోవడం లేదు. గుంటూరు నుంచి పోటీ చేయాలనే సీఎం ప్రతిపాదనను నేను అంగీకరించలేదు. సీఎం బిజీగా ఉన్నందున మళ్లీ ఇప్పట్లో కలిసే పరిస్థితి లేదు’ అని అప్పట్లో చెప్పారు. 

ఇప్పటికే వైకాపాకు చెందిన ఇద్దరు ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ బయటికొచ్చారు. బాలశౌరి ఇటీవలే జనసేనలో చేరారు. తాజాగా మరో ఎంపీ వైకాపాకు రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని