Nara Lokesh: జగన్‌.. కుర్చీ ఇలా మడతపెట్టి సీటు లేకుండా చేస్తాం: నారా లోకేశ్‌

పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వైకాపా నేతలు వస్తే ఊరుకునేది లేదని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు.

Updated : 16 Feb 2024 14:13 IST

నెల్లిమర్ల: పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వైకాపా నేతలు వస్తే ఊరుకునేది లేదని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. మీరు చొక్కాలు మడతపెడితే.. మేం మీ కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తామని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎలా చేస్తామో చూపిస్తామంటూ ఓ కుర్చీని మడతపెట్టి చూపించారు. ఈ సమయంలో తెదేపా, జనసేన కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

‘‘రాజధాని ఫైల్స్‌ సినిమా, రైతులంటే జగన్‌కు భయమేస్తోంది. ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్దకు పోలీసులను పంపారు. మూడు రాజధానులన్నారు.. ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకైనా వేశారా? మూడు ముక్కలాట ఆడుతున్న వైకాపాకు ప్రజలే బుద్ధి చెబుతారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్‌.. ఇప్పుడేం చెబుతారు? ఆ దుకాణాల వద్ద చర్చ పెట్టుకుందాం.. అక్కడికి వచ్చేందుకు సిద్ధమా? ప్రభుత్వమే అధికారులను నియమించి టార్గెట్‌ పెడుతోంది. ఐదేళ్లుగా విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీలు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ ప్రభుత్వం సాక్షి క్యాలెండర్‌ తప్ప.. జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చిందా?యువత నిలదీస్తారని పరదాలు కట్టుకుని సీఎం తిరుగుతున్నారు. జగన్‌ అద్భుతమైన స్కామ్‌ స్టార్‌. ఎన్నికల ముందు ఇళ్లు కాదు.. ఏకంగా పట్టణాలు కడతామన్నారు. అధికారంలోకి వచ్చాక దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు’’ అని లోకేశ్‌ విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని