Sharad pawar: ఆ ఇద్దరు ఎంపీలను తొలగించాం.. శరద్‌ పవార్‌

మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రఫుల్‌ పటేల్‌,  సునీల్‌ తట్కరేలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు శరద్‌ పవార్‌ ప్రకటించగా.. శరద్‌ పవారే తమ పార్టీ జాతీయ అధ్యక్షుడంటూ అజిత్‌ పవార్‌ అన్నారు.

Published : 03 Jul 2023 18:57 IST

ముంబయి: మహారాష్ట్రలో ఎన్సీపీలో చీలిక తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్సీపీని చీల్చి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన అజిత్‌ పవార్‌ వైపు నిలిచిన ఇద్దరు ఎంపీలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు శరద్‌పవార్‌ ప్రకటించగా.. శరద్‌ పవారే తమ పార్టీ జాతీయ అధ్యక్షుడంటూ అజిత్‌ పవార్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. ఎంపీలు సునీల్‌ తట్కరే, ప్రఫుల్‌ పటేల్‌ను ఎన్సీపీ నుంచి నుంచి తొలగిస్తున్నట్టు ఈ సాయంత్రం శరద్‌ పవార్‌ ట్విటర్‌లో ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున వారిద్దరినీ పార్టీ సభ్యుల రిజిస్టర్‌ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. 

శరద్‌ పవారే మా జాతీయ అధ్యక్షుడు.. అజిత్‌ 

ఇదిలా ఉండగా.. శరద్‌ పవార్‌ సారథ్యంలోని ఎన్సీపీపై తిరుగుబావుటా ఎగురవేసిన నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. మెరుగైన మహారాష్ట్ర కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ అన్నారు. శరద్‌ పవారే ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడని వ్యాఖ్యానించారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉన్నందు వల్లే తాను డిప్యూటీ సీఎం అయినట్టు చెప్పారు. ఈ రోజు గురుపౌర్ణిమ అని.. శరద్‌ పవార్‌ ఆశీస్సులు తమపై కొనసాగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సునీల్ తట్కరేను ఎన్సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రఫుల్‌ పటేల్‌  నియమించారన్నారు. అనంతరం తట్కరే మాట్లాడుతూ.. తాను ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నట్టు చెప్పారు. మహారాష్ట్రలో తమ పార్టీని బలోపేతం చేస్తాననన్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ నాయకులందరినీ సమావేశానికి పిలిచినట్టు వెల్లడించారు.

అజిత్‌ పవార్‌ (Ajit Pawar) మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం మధ్యాహ్నం అనూహ్యంగా అధికారపక్షం (భాజపా-శిందే సారథ్యంలోని ప్రభుత్వం)లో చేరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా, మిగతా వారు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, అజిత్‌ వర్గానికి పార్టీ మద్దతు లేదని ఎన్సీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అజిత్‌ పవార్‌ సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు (Disqualification) వేయాలని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ (Rahul Narwekar)ను ఎన్సీపీ కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని