CMO Andhra Pradesh: ఇది పార్టీ ఖాతానా.. సీఎంఓ ఖాతానా?.. ఏపీ సీఎం కార్యాలయంపై నెటిజన్ల ఫైర్‌!

ఏపీ సీఎంఓ ఎక్స్‌ ఖాతాలో పార్టీ ఫొటోలు పెట్టడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది పార్టీ ఖాతానా? ప్రభుత్వ ఖాతానా? అని ఫైర్‌ అవుతున్నారు.

Updated : 09 Oct 2023 18:21 IST

అమరావతి: సీఎం కార్యాలయం (CMO Andhra Pradesh) అధికారిక సామాజిక మాధ్యమ ఖాతా అంటే ఎంత హుందాగా ఉండాలి? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సీఎం నిర్ణయాలు మాత్రమే ప్రతిబింబించాలి. సీఎం తీసుకునే అధికారిక నిర్ణయాలు, ముఖ్యమంత్రి హోదాలో పాల్గొనే, పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందించడం వరకు ఆ ఖాతా బాధ్యత. అదే ఖాతా పార్టీ రంగు పూసుకుంటే.. నెటిజన్ల నుంచి అదే స్థాయిలో రియాక్షన్‌ వస్తుంది. ఏపీ సీఎంఓ అధికారిక ఎక్స్‌ (X) ఖాతాను ఏకంగా పార్టీ కార్యక్రమాలకు వాడేస్తున్న తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ఇది సీఎంఓ ఖాతానా? పార్టీ ఖాతానా? అని నిలదీస్తున్నారు.

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైకాపా విస్తృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత హోదాలో ముఖ్యమంత్రి జగన్‌ హాజరయ్యారు. పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులూ పాల్గొన్నాయి. ‘ముఖ్యమంత్రి జగన్‌ ఫలానా కార్యక్రమంలో ఇవాళ పాల్గొన్నారు’ అని సీఎంఓ ఖాతా నుంచి ఒక వేళ పోస్టు వెలువడి ఉంటే నెటిజన్లు పెద్దగా పట్టించుకునే వారు కాదేమో. పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు.. పార్టీ శ్రేణులు, వారు మాట్లాడుతున్న ఫొటోలు, భోజనాలు చేస్తున్న ఫొటోలను సైతం సీఎంఓ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఏపీ సీఎం ఫేస్‌బుక్‌ ఖాతాలోనూ కొన్ని ఫొటోలు దర్శనమిచ్చాయి.

ఈ పోస్టులు చూసిన వారికి ఒక క్షణం వైకాపా అధికారిక ఎక్స్‌ హ్యాండిలే చూస్తున్నామేమో అనే ఫీలింగ్‌ కలిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతలా పార్టీ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలతో నింపేశారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఏ అకౌంట్‌ నుంచి ఎలాంటి పోస్టులు పెట్టాలో తెలీదా? అది సీఎంఓ అకౌంట్‌ అనుకుంటున్నారా? పార్టీ ఖాతా అనుకుంటున్నారా?’’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఈ ఖాతాను కూడా బహుశా ఐప్యాక్‌ టీమే హ్యాండిల్‌ చేస్తోందనుకుంటా’’ అని మరో యూజర్‌ కామెంట్‌ పెట్టారు. ఓవైపు నెటిజన్లు తిట్ల వర్షం కురిపిస్తున్నా.. ఏపీ సీఎంఓ ఖాతా నుంచి ఈ పోస్టులను డిలీట్‌ చేయకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని