థర్డ్‌వేవ్‌.. అజాగ్రత్తగా ఉంటే కష్టమే: కేంద్రం

దేశంలో కరోనా రెండోదశ వ్యాప్తి ఇప్పుడిప్పుడే కాస్త అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఏప్రిల్‌, మే నెలల్లో ఎదురైన పరిస్థితులు మళ్లీ తప్పవని కేంద్రం హెచ్చరించింది. మూడో దశ వ్యాప్తి మొదలైతే నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌  హెచ్చరించారు. వైరస్‌ ఇంకా పూర్తగా అదుపులోకి రాలేదని,..

Published : 04 Jun 2021 22:18 IST

దిల్లీ: దేశంలో కరోనా రెండోదశ వ్యాప్తి ఇప్పుడిప్పుడే కాస్త అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఏప్రిల్‌, మే నెలల్లో ఎదురైన పరిస్థితులు మళ్లీ తప్పవని కేంద్రం హెచ్చరించింది. మూడో దశ వ్యాప్తి మొదలైతే నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌  హెచ్చరించారు. వైరస్‌ ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, మహమ్మారి తన రూపాన్ని మార్చుకుంటున్నందున మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మే 7న నమోదైన అత్యధిక కేసులను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం 68 శాతం మేర పాజటివ్ కేసులు తగ్గినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 377 జిల్లాల్లో కేవలం 5 శాతం కంటే తక్కువ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. మరో 257 జిల్లాల్లో దాదాపు 100 చొప్పున కొత్త కేసులు వస్తున్నాయి. దీనిని బట్టి వైరస్‌ ఉద్ధృతి కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే ఇది ఒక్క రోజులో వచ్చిన మార్పేమీ కాదని, వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉండటం వల్ల జన సంచారం బాగా తగ్గిందని, క్రమంగా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని వీకే పాల్‌ అభిప్రాయపడ్డారు. ‘‘వైరస్‌ ఉద్ధృతి తగ్గింది కదా అని.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో తిరిగినట్లు బయట తిరగొద్దు. అలా చేస్తే మహమ్మారి ప్రళయం సృష్టిస్తుంది. గణితశాస్త్ర పరంగానూ ఇది నిరూపితమైంది. సెకెండ్‌ వేవ్‌ కంటే థర్డ్‌ వేవ్‌ మరింత వేగంగా విస్తరిస్తుంది. వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం తగ్గించాలి. ఈలోగా సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ చేపట్టాలి’’ అని వీకే పాల్‌ అన్నారు.

మరోవైపు భారత్‌లో కరోనా మూడో విడత ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఎప్పుడు వస్తుందన్న దానిపై స్పష్టత లేదు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తదితర అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మూడో దశ వ్యాప్తిలో చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆదిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మూడోముప్పు ఎప్పుడు సంభవించినా సంసిద్ధంగా ఉండేలా ప్రణాళికలు రచించుకుంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని