NCP to EC: ‘ఎన్సీపీలో వివాదాల్లేవు..!’ ఈసీకి శరద్‌ పవార్‌ వివరణ

ఎన్సీపీలో వివాదాల్లేవని ఆ పార్టీ శరద్‌ పవార్‌ వర్గం ఎన్నికల సంఘానికి తెలిపింది. అందరూ పార్టీ అధినేత శరద్ పవార్ వెంటే ఉన్నారని స్పష్టం చేసింది.

Published : 09 Sep 2023 17:30 IST

ముంబయి: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP)లో ఎలాంటి వివాదాలు లేవని శరద్‌ పవార్‌ (Sharad Pawar) వర్గం ఎన్నికల సంఘానికి తెలిపింది. కేవలం కొంతమంది దురుద్దేశపూరిత వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ నుంచి బయటకు వెళ్లినట్లు వెల్లడించింది. పార్టీ పేరు, గుర్తు విషయంలో అజిత్‌ పవార్‌ (Ajit Pawar) దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్నికల సంఘం (EC) సమాధానం కోరగా.. ఈ మేరకు ప్రాథమిక వివరణ సమర్పించినట్లు శరద్‌ పవార్‌ వర్గం వెల్లడించింది. మరోవైపు అజిత్‌ పవార్‌ దీనిపై స్పందిస్తూ.. ‘ఈసీ’ సరైన నిర్ణయమే తీసుకుంటుందని చెప్పారు.

‘పార్టీ విషయంలో అజిత్ పవార్ పలుమార్లు తీసుకున్న విరుద్ధ నిర్ణయాలను మేం ప్రస్తావించాం. ఎటువంటి చట్టపరమైన అంశాలు, సభ్యుల బలం లేకుండా పార్టీ విషయంలో ఎన్నికల కమిషన్ ముందు ఆయన ఎలా వాదిస్తారు?’ అని శరద్ పవార్ వర్గం ప్రశ్నించింది. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంతమంది పార్టీ ఫిరాయించడం తప్ప.. ఎన్సీపీలో అంతర్గతంగా ఎలాంటి వివాదాలు లేవని ఈసీకి తెలియజేశామని పేర్కొంది. పార్టీ చెక్కుచెదరకుండా ఉందని, అందరూ పార్టీ అధినేత శరద్ పవార్ వెంటే ఉన్నారని స్పష్టం చేసింది.

ప్రజాస్వామ్య దేశాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు: చిదంబరం

అయితే, ఎన్సీపీ విషయంలో ఎన్నికల సంఘం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు. తన పిటిషన్‌పై ఎన్నికల సంఘానికి శరద్‌ పవార్‌ అందజేసిన వివరణపై ఆయన స్పందించారు. ఆదివారం కొల్హాపుర్‌లో నిర్వహించనున్న ర్యాలీలో తమ వైఖరిని వెల్లడిస్తామని చెప్పారు. ఎన్సీపీకి చెందిన రెండు వర్గాలు పరస్పరం నోటీసులు జారీ చేసుకున్నప్పటికీ.. ఎన్నికల సంఘం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా.. అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఈ ఏడాది జులైలో ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇది కాస్త పార్టీలో చీలికకు దారితీసింది. అనంతరం.. పార్టీలో తమకు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉందని, పార్టీ పేరుతోపాటు ఎన్నికల గుర్తును తమకే కేటాయించాలంటూ అజిత్‌ పవార్‌ వర్గం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని