అది ‘మూడో కూటమి’ సమావేశం కాదు

రాజకీయ కురువృద్ధుడు శరద్‌ పవార్‌ నివాసంలో మంగళవారం జరగనున్న ప్రతిపక్షాల భేటీ అనేక ఊహాగానాలకు తెరతీస్తోంది. భాజపా, కాంగ్రెస్‌ కేంద్రాలుగా సాగుతున్న రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా

Updated : 22 Jun 2021 18:50 IST

శరద్‌ పవార్‌ నివాసంలో భేటీపై యశ్వంత్‌ సిన్హా ట్వీట్‌

దిల్లీ: రాజకీయ కురువృద్ధుడు శరద్‌ పవార్‌ నివాసంలో మంగళవారం జరగనున్న ప్రతిపక్షాల భేటీ అనేక ఊహాగానాలకు తెరతీస్తోంది. భాజపా, కాంగ్రెస్‌ కేంద్రాలుగా సాగుతున్న రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ‘తృతీయ కూటమి’ ఏర్పాటు కోసమే ఈ సమావేశం జరగనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలకు చెక్‌ పెడుతూ సీనియర్‌ రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా ఓ ట్వీట్‌ చేశారు. అది మూడో కూటమి భేటీ కాదని, రాష్ట్ర మంచ్‌ సమావేశానికి పవార్‌ అధ్యక్షత వహిస్తున్నట్లు వెల్లడించారు.

‘‘మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్రమంచ్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించేందుకు శరద్‌ పవార్‌ అంగీకరించారు. ఆయన నివాసంలోనే ఈ భేటీ జరగనుంది’’ అని సిన్హా ట్విటర్‌లో తెలిపారు. అటు ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. నేటి భేటీలో రాజకీయ నేతలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), యశ్వంత్‌ సిన్హా (తృణమూల్‌), సంజయ్‌ సింగ్‌ (ఆప్‌), డి.రాజా (సీపీఐ) వంటి 15 మంది నేతలతో పాటు మాజీ సీఈసీ ఎస్‌.వై.ఖురేషి, సీనియర్‌ న్యాయవాది కె.టి.ఎస్‌.తులసి, బాలీవుడ్‌ ప్రముఖులు జావేద్‌ అఖ్తర్‌, ప్రీతీష్‌ నంది, ప్రముఖ పాత్రికేయుడు కరణ్‌థాపర్‌ తదితరులు దీనికి హాజరవనున్నట్లు చెప్పారు.

ఈ రాష్ట్రమంచ్‌ను 2018లో యశ్వంత్‌ సిన్హా, శతృఘ్న సిన్హా స్థాపించారు. రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరు తరచూ సమావేశాలు నిర్వహిస్తుంటారు. అయితే శరద్‌ పవార్‌, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సోమవారం భేటీ అయ్యారు. దీంతో నేటి శరద్‌ పవార్‌ భేటీపై వార్తలు గుప్పుమన్నాయి. మిషన్‌ 2024 పేరుతో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కోవాలన్న లక్ష్యంతో అన్ని పక్షాలను ఏకం చేసే పనిని ఈ సమావేశం ద్వారా మొదలుపెట్టనున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాపై ప్రత్యామ్నాయ కూటమిని నిలబెట్టి అక్కడి ఫలితాలను భవిష్యత్తు కార్యాచరణకు వేదికగా మలచుకొనే ఆలోచనతోనే ఈ సమావేశానికి శ్రీకారం చుట్టారనే వార్తలు వినిపించాయి.

అయితే ఈ భేటీపై ప్రశాంత్‌ కిశోర్‌ స్పందించారు. శరద్‌ పవార్‌ అధ్యక్షతన జరిగే సమావేశంలో తాను పాల్గొనట్లేదని వెల్లడించారు. అంతేగాక, ప్రస్తుత పరిస్థితుల్లో భాజపాను ఎదుర్కొనేందుకు మూడు, లేదా నాలుగో కూటమి సాధ్యపడుతుందని తాను విశ్వసించట్లేదని ఆయన చెప్పడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని