ఎస్పీ నుంచి అఖిలేశ్‌.. కాంగ్రెస్‌ నుంచి అఖిలేశ్‌.. స్వతంత్రుడిగా అఖిలేశ్‌.. ఏంటీ గందరగోళం?

Up elections 2022: ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్నది ఒకరు కాదు.. నలుగురు అఖిలేశ్‌ యాదవ్‌లు.

Updated : 01 Mar 2022 05:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్‌ యాదవ్‌ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు?’.. ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే ఠక్కున.. ‘ఇంకే పార్టీ సమాజ్‌వాదీ పార్టీ నుంచేగా. అయినా, ఆ పార్టీ అధ్యక్షుడు వేరే పార్టీ నుంచి పోటీచేస్తారా?’ అని తిరిగి విరుచుకుపడకండి. ఎందుకంటే మీరు ఈ కథనం చదివాక మీరు చెప్పే సమాధానం తప్పు కావొచ్చు. కారణం ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్నది ఒకరు కాదు.. నలుగురు అఖిలేశ్‌ యాదవ్‌లు కాబట్టి!! సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ను పక్కన పెడితే.. మిగిలిన ముగ్గురిలో ఒకరు ఎస్పీ.. మరొకరు కాంగ్రెస్‌.. ఇంకొకరు స్వతంత్ర అభ్యర్థిగా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆగండాగండి ఒక్క పేర్లతోనే అయిపోలేదు.. ఇంకా చాలా ఉన్నాయ్‌!

1| యూపీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఓ ప్రకటన. ఈ సారి ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారన్నది దాని సారాంశం. ప్రస్తుతం అజంగఢ్‌ ఎంపీగా ఉన్న ఆయన.. ఎస్పీకి మంచి పట్టున్న కర్హల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ స్థానానికి ఎన్నిక పూర్తయ్యింది. ఇదీ అఖిలేశ్‌ యాదవ్‌-1 కథ. ఇక మిగిలిన ముగ్గురి సంగతి చూద్దాం.

2| అఖిలేశ్‌ యాదవ్‌ పేరుతో పోటీ చేస్తున్న మరో వ్యక్తి కూడా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన వారే. ప్రస్తుతం ఈయన ముబారక్‌పూర్‌ నుంచి పోటీలో ఉన్నారు. చివరి దశలో ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈయన విషయంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు జరిగాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో ఈయన బీఎస్పీ అభ్యర్థి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. దీంతో ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్పీ అధినేత పేరుతోనే బరిలోకి దిగుతున్న తనకు ప్రజల నుంచి మద్దతు ఉందని చెబుతున్నారు. ‘సీఎంగా ఆ అఖిలేశ్‌.. ముబారక్‌పూర్‌లో ఈ అఖిలేశ్‌’ అంటూ తన విజయం గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారని ఈ అఖిలేశ్‌ యాదవ్‌ చెబుతున్నారు. ఈ అఖిలేశుడి పేరు వెనకా ఓ ఆసక్తికర అంశం ఉంది. ఈయనకు ముగ్గురు సోదరులు. వారి పేర్లు- అవదేశ్‌ యాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌, అమరేశ్‌ యాదవ్‌. ముగ్గురి పేర్లలోనూ ‘యేశ్‌’ కామన్‌గా ఉండడంతో వీరి తండ్రి ఈయనకు అఖిలేశ్‌ అని పేరుపెట్టారట. అంతేకాదండోయ్‌! పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఈ అఖిలేశ్‌ పేరు చూసి కొందరు ఎస్పీ అధినేత రెండు చోట్ల పోటీ చేస్తున్నారనుకుని పొరపడ్డారట!

3| అఖిలేశ్‌ పేరుతో పోటీచేస్తున్న ఇంకో వ్యక్తి కాంగ్రెస్‌ నుంచి బికాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఈయన సైతం సమమాజ్‌వాదీ పార్టీకి చెందిన వారే. 2016లో కాంగ్రెస్‌లో చేరారు. ఈయన విషయంలోనూ ఓ సరదా సందర్భం ఉంది. ‘ఓ రోజు అఖిలేశ్‌ భయ్యా జిందాబాద్‌ అంటూ మా పార్టీ అనుచరులు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న కొందరు ఎస్పీ మద్దతుదారులు సైతం నాకు అనుకూలంగా నినాదాలు చేశారు. కాసేపటికి విషయం తెలుసుకుని నినాదాలను విరమించుకున్నారు’’ అంటూ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న సరదా సందర్భాన్ని పంచుకున్నారు. కొందరైతే సమాజ్‌వాదీ పార్టీ గుర్తు హస్తం (కాంగ్రెస్‌ గుర్తు) ఎప్పుడైందా? అని ఆశ్చర్యపోయినవారూ ఉన్నారంటూ చెప్పుకొచ్చారు.

4| ఇక చివరి వ్యక్తి. గున్నౌర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మరో అఖిలేశ్‌ యాదవ్‌ అసలు పేరు లఖ్వేంద్ర సింగ్‌. పుట్టినప్పుడు అదే పేరుపెట్టినప్పటికీ తన నాయనమ్మ తనను అఖిలేశ్‌ యాదవ్‌ అనే పిలవడం ప్రారంభించిదంట. దాంతో అందరూ అలానే పిలవడం మొదలు పెట్టారట. దీంతో అదే పేరుతో తాను నామినేషన్‌ దాఖలు చేసినట్లు లఖ్వేంద్రసింగ్‌ తెలిపారు. ఇక్కడా ఓ ట్విస్ట్‌ ఉందండోయ్‌! ఈయన పోటీచేస్తున్న స్థానంలో ఎస్పీ తరఫున పోటీ చేస్తున్నది రామ్‌ ఖిలారీ సింగ్‌. ఆయన ఈ అఖిలేశుడికి తండ్రే. తాను కేవలం ఓ డమ్మీ అభ్యర్థి మాత్రమేనని చెప్పుకొచ్చారు. హమ్మయ్య! ఇదీ కథ. ఇంతకీ మార్చి 10న వెలువడే ఫలితాల్లో ఎంతమంది అఖిలేశులు విజయం సాధిస్తారో చూడాలి మరి! ఇంతకీ ఈ పేర్ల గోల వింటే మీకేం గుర్తోస్తోంది?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని