Rahul Gandhi: 2024 ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయ్‌..: రాహుల్‌ గాంధీ

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం ఓటమి ఖాయమని రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయన్నారు.

Updated : 02 Jun 2023 12:42 IST

వాషింగ్టన్‌: ప్రస్తుతం భారత రాజకీయాల్లో ప్రతిపక్షాలు చాలా ఐక్యంగా ఉన్నాయని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయని ఆయన విపక్షాల (Opposition) విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అమెరికా (USA) పర్యటనలో ఉన్న రాహుల్‌.. తాజాగా వాషింగ్టన్‌లోని నేషనల్ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

‘‘వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్‌ (Congress) పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేను విశ్వసిస్తున్నా. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించి భాజపాను గద్దె దించింది. త్వరలో జరగబోయే మూడు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా చూడండి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలు (2024 General elections) ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఈ రాష్ట్రాల ఫలితాలు స్పష్టమైన సంకేతాలిస్తాయి. ఇప్పుడు భారత్‌లో ప్రతిపక్షాలు మరింత ఐక్యంగా ఉన్నాయి. విపక్ష పార్టీలతో కాంగ్రెస్‌ విస్తృతంగా సమావేశాలు జరుపుతోంది. విపక్షాల ఐక్యత సరైన మార్గంలో వెళ్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కచ్చితంగా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి’’ అని రాహుల్‌ (Rahul Gandhi) తెలిపారు.

ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi)కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి ప్రశ్నించగా.. ‘‘దేశంలోని అన్ని సంస్థలపై ప్రభుత్వం నియంత్రణ ఉంది. పత్రికారంగంపైనా వారు పట్టుబిగించారు. అయితే ఆ వార్తలను నేను ఎప్పటికీ నమ్మబోను’’ అని రాహుల్‌ సమాధానమిచ్చారు. ఇక, ఈ సందర్భంగా మీడియా స్వేచ్ఛ గురించి స్పందిస్తూ.. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థకు మీడియా స్వేచ్ఛ అత్యంత కీలకమైనది. విమర్శలను హుందాగా స్వీకరించాలి. కానీ, భారత్‌లో ఈ స్వేచ్ఛను బలహీనపరుస్తున్నారు. మీడియాపై నిర్బంధం ఉంది’’ అని భాజపా సర్కారుపై రాహుల్‌ విమర్శలు గుప్పించారు. అయితే, రాహుల్‌ వ్యాఖ్యలను భాజపా నేతలు ఖండిస్తున్నారు. కాంగ్రెస్‌ నేత విదేశీ గడ్డపై భారత ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని