ఆ సర్టిఫికెట్లపైనా ప్రధాని ఫొటో వేయండి..!

ఎన్డీయే బిహార్‌ కూటమిలో ఫొటోల రగడ మొదలైంది. కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ఉండటంపై బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి,

Published : 25 May 2021 01:25 IST

పట్నా: ఎన్డీయే బిహార్‌ కూటమిలో ఫొటోల రగడ మొదలైంది. కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ఉండటంపై బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ ఆవామ్‌ మోర్చా(హెచ్‌ఏఎమ్‌) అధ్యక్షుడు జితన్‌ రామ్‌ మాంఝీ ట్విటర్‌ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్టిఫికెట్లపై ఫొటోలు ప్రచురించడం ద్వారా టీకా పంపిణీతో వచ్చే ప్రతిష్ఠను తన ఖాతాలో వేసుకొనేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనాతో మృతి చెందినవారి మరణ ధ్రువీకరణ పత్రాలపైనా ప్రధాని ఫొటో వేయాలని ఎద్దేవా చేస్తూ ట్వీట్‌
చేశారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌ లాంటి భాజపాయేతర పార్టీ పాలిత రాష్ట్రాల్లోనూ ఫొటో రాజకీయాలు జోరందుకున్నాయి. తాము కూడా ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్లను తెప్పించేందుకు కృషి చేశామని, దీంతో వచ్చే ప్రతిష్ఠ తమకూ దక్కాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుకుంటున్నారు.  బిహార్‌కు అత్యవసర ఔషధాలు, టీకాలు, ఆక్సిజన్‌, నిధుల కేటాయింపులో కేంద్రం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఇటీవల మాంఝీ విమర్శలు చేశారు.  ‘‘మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.5 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని 2020 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా కుదేలయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భృతిని మంజూరు చేయాలని సీఎం నీతీశ్‌ కుమార్‌ను కోరాను’’ అని మాంఝీ పేర్కొన్నారు. 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని