Rahul Gandhi: వయనాడ్‌ నుంచి రాహుల్ గాంధీ పోటీ ఉండదా..? బరిలోకి డి.రాజా సతీమణి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈసారి వయనాడ్ నుంచి పోటీ చేసేలా కనిపించడం లేదు. ఆయన మరో స్థానాన్ని ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. 

Published : 26 Feb 2024 20:19 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోటీ చేసే స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన మరోసారి కేరళలోని వయనాడ్(Wayanad) నుంచి పోటీలో ఉండకపోవచ్చని మీడియా కథనాలు వెల్లడించాయి. కర్ణాటక లేక తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రెండు నియోజకవర్గాల నుంచి ఆయన బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్.. విపక్ష ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతోంది. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి బరిలో దిగిన కేరళలోని ఇండియన్‌ యూనియన్‌ ముస్లింగ్ లీగ్‌(IUML).. ఈసారి మూడు సీట్లు  కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇందులోభాగంగా మెజార్టీ ముస్లిం ఓటర్లు ఉన్న వయనాడ్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తోందట. మరోవైపు సీపీఐ తన పార్టీ ప్రముఖ నేత డి.రాజా(D Raja) సతీమణి యాని రాజాను అక్కడినుంచే బరిలోకి దింపింది. ఒకవైపు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుంటే.. ఆ కూటమిలోని సీపీఐ అభ్యర్థిని ప్రకటించడం గమనార్హం. ఇది విపక్ష కూటమికి ఇబ్బందికర పరిణామమే. ఈ కారణాల వల్లే ఆయన వయనాడ్‌ను వదులుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

రాహుల్‌ 2019లో తొలిసారి వయనాడ్‌(Wayanad) నుంచి పోటీ చేశారు. నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో సీపీఐ అభ్యర్థిపై విజయం సాధించారు. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ కంచుకోట అమేఠీ నుంచి బరిలోకి దిగినప్పటికీ.. భాజపా నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో ఆయన పోటీ చేసే స్థానాలపై ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని