RPN Singh: కాంగ్రెస్‌ గుడ్‌బై చెప్పి.. భాజపాలో చేరిన ఆర్‌పీఎన్‌ సింగ్

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన కీలక నేత ఆర్‌పీఎన్ సింగ్ భాజపాలో చేరారు. దిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కమలం కండువా కప్పి సింగ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.

Published : 25 Jan 2022 22:44 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన కీలక నేత ఆర్‌పీఎన్ సింగ్ భాజపాలో చేరారు. దిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కమలం కండువా కప్పి సింగ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ రోజు మధ్యాహ్నం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆర్‌పీఎన్ సింగ్ ట్విటర్ వేదికగా రాజీనామా లేఖ అందించారు. ఆ వెంటనే భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ట్వీట్ చేశారు. అనంతరం పార్టీలో చేరిన ఆయన ప్రధాని మోదీ పనితీరును ప్రశంసించారు. ‘32 ఏళ్లుగా నేను కాంగ్రెస్‌తో కలిసి పనిచేశాను. ఇది అప్పుడున్న పార్టీ కాదు.  దేశం అభివృద్ధి చెందాలంటే అది ప్రధాని మోదీ నాయకత్వంలోనే జరగాలి. దేశాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్లేందుకు.. ఒక కార్యకర్తగా పనిచేస్తా. నన్ను ఇప్పటికే చాలా మంది భాజపాలో చేరమని అడిగారు’ అని ఈ సందర్భంగా మాట్లాడారు.  

ఇటీవల కాలంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను వీడిన రెండో కీలక నేత ఈయనే. గతేడాది సీనియర్‌ నేత జితిన్‌ ప్రసాద.. హస్తం పార్టీని వీడి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో ప్రసాదకు చోటు దక్కింది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో..సింగ్‌ను పద్రౌనా నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలని భాజపా యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ.. యూపీ మాజీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్యను నిలబెడుతోంది. మౌర్య ఇటీవలే భాజపా నుంచి ఎస్పీలో చేరిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని