Sanjay Raut: రాహుల్‌ జోడో యాత్రపై సంజయ్‌ రౌత్‌ మరోసారి విమర్శలు

సావర్కర్‌పై రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ శివసేన ఠాక్రే వర్గ నేత సంజయ్‌ రౌత్‌ మరోసారి విమర్శలు చేశారు. సావర్కర్‌ను విమర్శించడానికి ఆయన తప్పుబట్టారు.

Published : 20 Nov 2022 15:38 IST

ముంబయి: భారత్‌ జోడో యాత్ర తీసుకొచ్చిన సానుకూల శక్తి.. సావర్కర్‌పై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఆవిరైందని శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఈ మేరకు పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఆదివారం ఆయన ఓ వ్యాసం రాశారు. రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఎందుకు సున్నితమైన  అంశాల్ని లేవనెత్తుతున్నారని ప్రశ్నించారు. దీని వల్ల భాజపాకే ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. 

‘‘నేను మూడు నెలలు జైలులో గడిపా. అనేకమంది స్వాతంత్య్రసమరయోధుల్ని ఆర్థర్‌ రోడ్‌ జైలులో బంధించారు. సామాన్య ఖైదీగా ఒక్కరోజు జైలులో గడపడం కూడా చాలా కష్టం. అలాంటిది సావర్కర్‌ అండమాన్‌ సెల్యూలార్‌ జైలులో అనేక కష్టాలతో 10 ఏళ్లకు పైగా గడిపారు. ఆయన్ని ఏదో తప్పుడు అక్రమ నగదు చెలామణి కేసులో అరెస్టు చేయలేదు. బ్రిటిష్‌ వలస పాలనపై సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. అందుకే ఆయన్ని అండమాన్‌లో బంధించారు’’ అని రౌత్‌ అన్నారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన సంజయ్‌ రౌత్‌ ఇటీవలే జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

సావర్కర్‌ సోదరుడు నారాయణరావుని బ్రిటిష్‌వాళ్లు బేషరతుగా విడుదల చేశారని రౌత్‌ అన్నారు. కానీ, సావర్కర్‌ని మాత్రం షరతులతో విడిచిపెట్టారని పేర్కొన్నారు. దీన్ని బ్రిటిష్‌ వాళ్ల క్షమాభిక్షగా అభివర్ణించలేమన్నారు. జైలు నుంచి బయటకు రావడానికి క్షమాభిక్షను సావర్కర్‌ ఓ సాకుగా వాడుకున్నారని పేర్కొంటూ వై.డి.ఫడ్కే రాసిన పుస్తకాన్ని ఈ సందర్భంగా రౌత్‌ ఉటంకించారు. అలాగే బ్రిటిష్‌ వాళ్లకు సహకరిస్తానని సావర్కర్‌ పేర్కొనడం కూడా జైలు నుంచి బయటపడడానికి ఆయన వేసిన వ్యూహత్మక ఎత్తుగడ అని తెలిపారు. మహాత్మా గాంధీ సైతం సావర్కర్‌ను విడుదల చేయాలని కోరారన్నారు. 1923లో కాంగ్రెస్‌ సమావేశంలోనూ సావర్కర్‌ విడుదలకు డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేశారన్నారు.

ఈడీ దర్యాప్తులకు భయపడి నేడు అనేక మంది నాయకులు కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గుతున్నారని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. పార్టీలు మారి విశ్వాసఘాతుకానికి పాల్పడుతున్నారని విమర్శించారు. కానీ, దేశ  విముక్తి కోసం సావర్కర్‌ పదేళ్లు జైలులో గడిపారన్నారు. సావర్కర్‌ను విమర్శించడం భారత్‌ జోడో యాత్ర ఎజెండా కాదన్నారు. మరోవైపు భాజపా ఎనిమిదేళ్ల నుంచి అధికారంలో ఉన్నా.. సావర్కర్‌కు ఇప్పటి వరకు భారతరత్న ఇవ్వలేదని విమర్శించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూను విమర్శించడం ప్రధాని మోదీ ఆపరని.. ఇప్పుడు రాహుల్‌ గాంధీ సైతం సావర్కర్‌ విషయంలో అదే చేస్తున్నారని రౌత్‌ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ఏకం చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని