election results 2022: రావత్‌కు షాక్‌..దేవుడిచ్చిన తీర్పన్న సిద్ధూ..కీలక నేతల ఫలితాలిలా..

తాజాగా వెలువడుతోన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా దూసుకెళ్తోంది. పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కదులుతోంది. ఇక కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో పరాజయం మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి కీలక నేతల ఫలితాలిలా ఉన్నాయి.

Updated : 10 Mar 2022 16:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాజాగా వెలువడుతోన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా దూసుకెళ్తోంది. పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కదులుతోంది. ఇక కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో పరాజయం మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి కీలక నేతల ఫలితాలిలా ఉన్నాయి.

పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ విజయం..పంజాబ్‌లో ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్ దురి నుంచి విజయం సాధించారు. ఆయన 45 వేల ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై గెలుపొందారు. 

గోవా సీఎం సావంత్ గెలుపు..గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఉత్తర గోవాలోని సాంక్వెలిమ్ నుంచి విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో భాజపా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి ఓటమి..పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. పటియాలా అర్బన్ నియోజకవర్గంలో పోటీ పడిన ఆయన.. ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 

దివంగత నేత మనోహర్‌ పారికర్ తనయుడి పరాజయం..భాజపా టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు ఉత్పాల్ పారికర్. గోవాలోని పనాజీ నియోజకవర్గం నుంచి పోటీ పడి.. 800 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆయన దివంగత నేత మనోహర్ పారికర్ తనయుడు. మనోహర్ గోవా ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా సేవలు అందించారు. 

హరీశ్ రావత్‌కు ఎదురుదెబ్బ...ఉత్తరాఖండ్ మాజీ మఖ్యమంత్రి హరీశ్‌ రావత్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. లాల్‌కౌనా నుంచి 10 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడారు. ఈయన ఆధ్వర్యంలోనే ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారం సాగింది. 

ఓటమి అంగీకరించిన సిద్ధూ..‘ప్రజా తీర్పే దేవుడి తీర్పు. ప్రజల ఆదేశాన్ని వినయంగా అంగీకరిస్తున్నాం. ఆప్‌కి అభినందనలు’ అంటూ కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు. అమృత్‌సర్ ఈస్ట్ నుంచి పోటీపడిన ఆయన ఓటమి చెందారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండు స్థానాల నుంచి పోటీ పడిన ఆయన్నూ పరాజయమే పలకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని