CWC: పార్టీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది : సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ

మే 13వ తేదీ నుంచి జరుగనున్న ‘చింతన్‌ శివిర్‌’ కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) నేడు కీలక భేటీ నిర్వహించింది.

Published : 09 May 2022 20:12 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ప్రక్షాళన, పునరుత్థానంలో భాగంగా ‘చింతన్‌ శివిర్‌’ పేరుతో ఉదయ్‌పుర్‌లో మేధోమథన సదస్సును నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. మే 13వ తేదీ నుంచి జరుగనున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) నేడు కీలక భేటీ నిర్వహించింది. సదస్సులో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన అజెండాపై సీనియర్‌ నేతలతో చర్చలు జరిపింది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోపాటు ఎంపీ రాహుల్‌ గాంధీ, పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కాంగ్రెస్‌ చీఫ్‌ దిశానిర్దేశం చేశారు.

‘కాంగ్రెస్‌ పార్టీ ప్రతి ఒక్కరికీ మేలు చేసింది. ఆ రుణాన్ని తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఇందులో ఎటువంటి మంత్రదండం లేదు. కేవలం క్రమశిక్షణ, దృఢసంకల్పం, ఇదివరకు జరిగిన నష్టాల నుంచి త్వరగా కోలుకోవడం వంటివే ప్రధానాంశాలు. దీన్ని ఒక సంప్రదాయ కార్యక్రమంగా చూడకూడదు. ఎన్నికలు, సైద్ధాంతికపరంగా ఎదురవుతోన్న సవాళ్లను అధిగమించి పునర్‌ నిర్మించే కార్యక్రమంగా నిలపాలి’ అని సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ పేర్కొన్నారు. పార్టీ వేదికలపై స్వీయ విమర్శలు అవసరమన్న ఆమె.. అవి ఆత్మవిశ్వాసం, నైతికత దెబ్బతినేలా ఉండకూడదన్నారు. పార్టీ పునరుద్ధరణకు గానూ నేతల మధ్య ఐకమత్యం, సంకల్పం, నిబద్ధత కలిగి ఉండాలని సీనియర్‌ నేతలకు దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయితోపాటు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ రెబల్‌ నేతలను ఉద్దేశించి సోనియా గాంధీ ఈవిధంగా మాట్లాడారు.

ఇక చింతన్‌ శివిర్‌ అజెండాను రూపొందించడంతోపాటు పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులపై సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించారు. వివిధ స్థానాల్లో సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, ప్రస్తుతం మహిళలకు ఉన్న 33శాతం రిజర్వేషన్లు, జిల్లా స్థాయిలో అధిపతులను నియమించే అధికారాన్ని రాష్ట్రస్థాయికి కట్టబెట్టడం, భాజపాను అధిగమించే వ్యూహాలపైనా చర్చించారు.

ఇదిలాఉంటే, రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ వేదికగా ‘నవసంకల్ప్‌ చింతన్‌ శివిర్‌’ పేరుతో మే 13, 14, 15 తేదీల్లో సదస్సు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. ‘మిషన్‌ 2024’ పేరుతో కాంగ్రెస్‌ రూపొందిస్తున్న వ్యూహాన్ని ఈ శివిర్‌ ద్వారా పార్టీ కార్యకర్తల్లోకి తీసుకెళ్లాలన్నది అధిష్ఠానం వ్యూహం. ఇందుకు సంబంధించిన అజెండాను రూపొందించేందుకు సీడబ్ల్యూసీ సమావేశమయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని