TDP: ఆ బస్సును సీబీఐకి ఎందుకు అప్పగించలేదు?: తెదేపా నేత పట్టాభి

కాకినాడ జిల్లాలో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్సు కంపెనీకి చెందిన బస్సును పోలీసులు సీబీఐకి ఎందుకు అప్పగించలేదని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ప్రశ్నించారు.

Published : 25 Mar 2024 13:05 IST

అమరావతి: కాకినాడ జిల్లాలో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్సు కంపెనీకి చెందిన బస్సును పోలీసులు సీబీఐకి ఎందుకు అప్పగించలేదని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ప్రశ్నించారు. బస్సును పోలీసులు తనిఖీ చేసి ఆ కంపెనీ వాళ్లకే ఎందుకు అప్పజెప్పారని నిలదీశారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడారు.

అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు

‘‘సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారని సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులకు ముందే తెలుసు. అందుకే హార్డ్‌డిస్క్‌లు, రికార్డులన్నీ బస్సులో ఉంచారు. పోలీసులు వాటిని సీబీఐకి అప్పగించాల్సింది పోయి కంపెనీవాళ్లకే ఇస్తారా?ఇలా ఎందుకు చేశారో తెలియాలి. సీబీఐకి ఆధారాలు లభించకుండా చేయడంలో ఆంతర్యమేంటి?పైనుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే అంతా జరుగుతోంది. దర్యాప్తు సంస్థకు అడ్డుతగలాలని పోలీసులకు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలు వచ్చాయా? బస్సులో దొరికిన డాక్యుమెంట్లను తిరిగి కంపెనీకి ఎందుకు ఇచ్చినట్లు?బస్సు, అందులోని వస్తువులను పోలీసులు సీబీఐకి అప్పగించలేదంటే ఏమనాలి?పెద్ద వ్యవహారం బయటపడ్డాకా ఇంత ఉదాసీనతా?’’ అని ఆయన నిలదీశారు.

ఈ నెల 16న విశాఖ పోర్టుకు బ్రెజిల్‌ నుంచి వచ్చిన కంటెయినర్‌లో భారీగా డ్రగ్స్‌ నిల్వలు ఉండటాన్ని గుర్తించడం.. సీబీఐ అధికారులు సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందినదిగా నిర్ధరించడం తెలిసిందే. అదే సంస్థకు చెందిన బస్సు మూడు రోజులుగా కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్‌ కాలనీలో ఉండటం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి తనిఖీలు చేశారు. ఆ తర్వాత కంపెనీకి బస్సును అప్పగించారు. ఈ నేపథ్యంలో పట్టాభి మీడియా సమావేశం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని