CM Kcr: రేపు ముంబయి వెళ్లనున్న సీఎం కేసీఆర్‌... ఉద్దవ్‌ ఠాక్రేతో భేటీ

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా విధానాలపై పోరాటం, దేశ రాజకీయాల్లో మార్పే ఎజెండాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు ముంబయి వెళ్లనున్నారు. మహారాష్ట్ర

Updated : 19 Feb 2022 21:20 IST

హైదరాబాద్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా విధానాలపై పోరాటం, దేశ రాజకీయాల్లో మార్పే ఎజెండాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు ముంబయి వెళ్లనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్‌ దేశ ఆర్థిక రాజధానికి పయనంకానున్నారు. ఇటీవల కేసీఆర్‌కు ఫోన్‌ చేసిన మహారాష్ట్ర సీఎం.. భాజపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్‌ న్యాయం కోసం కేసీఆర్‌ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకునేందుకు సరైన సమయంలో గళం విప్పారన్న ఉద్దవ్‌ ఠాక్రే.. దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం కొనసాగించాలని, ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. ముంబయి వచ్చి తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిద్దామని ఉద్దవ్‌  కోరారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు రేపు ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. మధ్యాహ్నానానికి ముంబయి చేరుకుంటారు. బాంద్రా కుర్లాలోని ఉద్దవ్‌ నివాసానికి వెళ్లి అక్కడ ఆయనతో సమావేశమవుతారు. జాతీయ రాజకీయాలు, దేశ వ్యాప్త పరిస్థితులు, కేంద్రం-రాష్ట్రాల మధ్య సంబంధాలు, భవిష్యత్‌ కార్యాచరణ తదితర అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని పాలనాపరమైన అంశాలపై కూడా ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ వెంట కొంత మంది తెరాస నేతలు కూడా ముంబయి వెళ్లనున్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కూడా సీఎం కేసీఆర్‌ కలిసే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని