ts politics: కుర్చీ, కుటుంబం కోసం కేసీఆర్‌ ఎంతకైనా తెగిస్తారు: కిషన్‌రెడ్డి

 తెరాస పాలనలో తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. జన ఆశీర్వాదయాత్రలో భాగంగా కోదాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో

Updated : 24 Sep 2022 17:04 IST

కోదాడ:  తెరాస పాలనలో తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. జన ఆశీర్వాదయాత్రలో భాగంగా కోదాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది కేసీఆర్‌ కుటుంబం కోసమేనా? కేసీఆర్‌ మరికొన్ని రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణ అధ్వానంగా తయారవుతుంది. సీఎం కుర్చీ, కుటుంబం కోసం కేసీఆర్‌ ఎంతకైనా తెగిస్తారు. కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరముంది. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు కేసీఆర్‌ అనేక కుట్రలు పన్నుతున్నారు. ఈటల ఒక వ్యక్తి కాదు.. కోట్లాది మంది భాజపా కార్యకర్తల అండ ఉంది. నరేంద్రమోదీకి ఎన్నికలప్పుడే పార్టీలు.. అభివృద్ధిలో కాదు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ప్రధాని ఉచిత బియ్యం అందిస్తున్నారు. ప్రతి కేజీ బియ్యానికి కేంద్రం 37 రూపాయలు చెల్లిస్తుంది’’ అని కిషన్‌రెడ్డి వివరించారు.

‘కిషన్‌రెడ్డి నా అభిమాన నాయకుడు’: బండి సంజయ్‌

 భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ..‘‘ కిషన్‌రెడ్డి నా అభిమాన నాయకుడు.  భాజపాలో కష్టపడి పని చేసేవారికి పదవులు వస్తాయని చెప్పడానికి ఆయనే నిదర్శనం. కిషన్‌రెడ్డి కష్టపడి పనిచేశారు కాబట్టి క్యాబినెట్‌ మంత్రిని చేశారు. నరేంద్రమోదీ నిర్ణయాల్లో కిషన్‌రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. ఏడేళ్ల పాలనలో భాజపా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏమీ చేయరు. భాజపా పోరాటానికి భయపడే ఫామ్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చారు. మంత్రివర్గంలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారో కేసీఆర్‌ చెప్పాలి. ఆశయాలు, ఆకాంక్షలకు భిన్నంగా తెలంగాణలో పాలన సాగుతోంది. తెలంగాణ తల్లి కేసీఆర్‌ గడీలో బందీ అయ్యింది. విముక్తి కోసం భాజపా కార్యకర్తలు పని చేయాలి. కిషన్‌రెడ్డి అండగా ఉండగా.. ఏ కార్యకర్త భయపడాల్సిన అవసరం లేదు. లాఠీ దెబ్బలు, జైళ్లకు భాజపా భయపడదు. గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగరేసేందుకు కష్టపడి పనిచేద్దాం’’అని పార్టీ శ్రేణులకు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని