AAP: పదేళ్లలో దిల్లీకి ఏం చేశారు?.. భాజపా ఎంపీలకు ఆప్‌ ప్రశ్న!

గత పదేళ్లలో భాజపా ఎంపీలు దిల్లీ నగరానికి ఏం చేశారో చెప్పాలని ఆప్‌ నేత, మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ప్రశ్నించారు.

Published : 19 Mar 2024 00:55 IST

దిల్లీ: గత పదేళ్లలో భాజపా ఎంపీలు దిల్లీకి ఏం చేశారో చెప్పాలని ఆప్‌ ప్రశ్నించింది. వారు చేసిన అభివృద్ధిపై శ్వేత్రపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. దిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాల నుంచి బరిలో నిలిచే భాజపా అభ్యర్థులు.. తాము గెలిచాక 100 రోజుల ప్రాధాన్యాల జాబితాను ప్రకటించడంపై దిల్లీ మంత్రి, ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ మండిపడ్డారు. ప్రజలకు అవసరమైన సమయంలో ఈ ఎంపీలంతా ఎక్కడ ఉన్నారని నిలదీశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు ప్రశ్నలు సంధించారు. దిల్లీలో 2017-18లో అనేక దుకాణాలకు అధికారులు సీల్‌ వేయడంతో వ్యాపారాలు మూతపడ్డాయని.. డిఫెన్స్‌ కాలనీలో ఓ వృద్ధుడు తన దుకాణానికి సీల్‌ వేయొద్దంటూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల్ని వేడుకున్న వీడియో బయటకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఎంసీడీ, డీడీఎంఏ అధికారుల తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఆ సమయంలో ఈ ఎంపీలు ఏం చేశారని ప్రశ్నించారు. 

ఏడాదిన్నర కాలంలో దిల్లీలో 1.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారని.. భాజపా ఎంపీలు ఎవరైనా బుల్డోజర్ ముందు నిలబడ్డారా? కూల్చివేతల్ని ఆపేందుకు వచ్చారా? అని ప్రశ్నించారు. నగరంలో ట్రాఫిక్‌ పరిస్థితి మెరుగుపరుస్తామంటూ భాజపా ఎంపీ అభ్యర్థులుగా ఇప్పుడు వాగ్దానాలు చేస్తుండటంపై మంత్రి సౌరభ్‌ మండిపడ్డారు. ‘దిల్లీ ట్రాఫిక్‌ పోలీస్‌ కేంద్రం పరిధిలో ఉంది కదా.. మీరేం చేశారు? కొత్త సంవత్సరం రోజున నగరంలో కారుతో మహిళను ఢీకొట్టి 20 కి.మీ.ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన జరిగినప్పుడు భాజపా ఎంపీలు ఎక్కడ ఉన్నారు? దిల్లీలో అత్యాచారాలు, హత్యలకు సంబంధించిన ఘటనలు తరచూ వార్తల్లో వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రగ్స్‌ విక్రయం జరుగుతోంది. దాని గురించి ఎంపీలు ఎవరైనా మాట్లాడారా? అసలు పోలీసులేం చేస్తున్నారు? కొవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌ కొరత తలెత్తితే మీరేమైనా చేశారా? వేసవిలో దిల్లీకి హరియాణా నీటిని నిలిపివేస్తే.. ఆ రాష్ట్ర సీఎంతో సమావేశమై ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాల్సిన సమయంలోనూ మీరు లేరు’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మరోవైపు, ఈసారి కూడా ఏడు స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని భాజపా విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. దిల్లీలో ఆప్‌, కాంగ్రెస్‌ కలిసి బరిలో నిలుస్తున్నాయి. ఆప్‌ ఇప్పటికే నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా..  కాంగ్రెస్‌ ఇంకా మూడు స్థానాల్లో తమ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని