Ajit Pawar: ఎమ్మెల్యేలందరూ నాతోనే.. ఎన్సీపీ గుర్తుపైనే ఎన్నికల్లో పోటీ..!

ఎమ్మెల్యేలందరూ తనతోనే ఉన్నారని, భవిష్యత్తులో ఎన్సీపీ గుర్తుపైనే ఎన్నికల్లో పోటీ చేస్తామని అజిత్‌ పవార్‌ తెలిపారు. అయితే, ఈ ఆటలు ఎక్కువ కాలం సాగవని శివసేన (యూబీటీ) వర్గం నేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు.

Published : 02 Jul 2023 19:03 IST

ముంబయి: ఎన్సీపీ (NCP) ఎమ్మెల్యేలందరూ తనతోనే ఉన్నారని, ఒక పార్టీగానే ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) ప్రభుత్వానికి మద్దతు పలికినట్లు మహారాష్ట్ర (Maharashtra) ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ (Ajit Pawar) వెల్లడించారు. భవిష్యత్తులో పార్టీ గుర్తు (NCP Symbol)పైనే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం అజిత్‌ మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో అధికార పక్షంలో చేరినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన (Shivsena)తో కలిసి వెళ్లగలిగితే.. భాజపా (BJP)తో ఎందుకు వెళ్లకూడదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేస్తామన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవికి శుక్రవారమే రాజీనామా చేసినట్లు వెల్లడించారు.

మరోవైపు.. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ స్పందించారు. ఈ ఆటలు ఎక్కువ కాలం సాగవని పేర్కొన్నారు. ఇలా జరుగుతుందని ముందే తెలుసని చెప్పారు. ‘‘రాష్ట్రంలో రాజకీయాలను నాశనం చేసేందుకు కొంతమంది కంకణం కట్టుకున్నారు. వారు తమ పనిని కొనసాగించొచ్చు. ఇప్పుడే శరద్‌ పవార్‌తో మాట్లాడా. ‘నేను దృఢంగా ఉన్నా. మనకు ప్రజామద్దతు ఉంది. మళ్లీ ప్రతిదీ పునర్నిర్మించుకుందాం’ అని ఆయన చెప్పారు. పైగా.. ప్రజలు ఈ ఆటలను ఎక్కువ కాలం సహించరు’’ అని సంజయ్‌ రౌత్‌ ట్వీట్‌ చేశారు. ఎవరినైతే జైలుకు పంపించేందుకు భాజపా సిద్ధమైందో.. ఆయన నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని అజిత్‌ పవార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. త్వరలోనే ఏక్‌నాథ్‌ శిందేతోపాటు ఆయనతో వెళ్లిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, కొన్ని రోజుల్లో రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రి వస్తారని తెలిపారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్సీపీ కీలక నేత అజిత్‌ పవార్‌ పలువురు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడం, అనంతరం సీఎం ఏక్‌నాథ్‌ శిందేను కలవడం, ఆ వెంటనే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఇప్పటికే శిందే వర్గం చీలిక పరిణామాలతో దెబ్బతిన్న మహావికాస్‌ అఘాడీకి అజిత్‌ తాజా నిర్ణయంతో మరో షాక్‌ తగిలినట్లయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని