అలా చేయలేకపోతే రాజకీయాలే వదిలేస్తా: ఫడణవీస్‌ 

భాజపా సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను....

Updated : 26 Jun 2021 17:42 IST

నాగ్‌పూర్‌: భాజపా సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తుందన్నారు. భాజపా అలా చేయలేకపోతే తాను రాజకీయాలనుంచి విరమించుకుంటానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో ఓబీసీ కోటా రద్దుకు వ్యతిరేకంగా శనివారం నాగ్‌పూర్‌లోని వెరైటీ స్క్వేర్‌ చౌక్‌ వద్ద భాజపా కార్యకర్తలు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీంతో పోలీసులు ఫడణవీస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకముందు ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని చెబుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తోంది. నిజానికి ఈ అంశాన్ని రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చు. చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్‌ను పునరుద్ధరించవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చట్టం చేయాల్సిన అవసరంలేదు. మహారాష్ట్ర మినహా మిగతా రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే చట్టం చేయాలి. ప్రభుత్వం చెబుతున్న అవాస్తవాలను బహిర్గతం చేసేదాకే వెనకడుగు వేసేదిలేదు. అప్పటిదాకా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం’’ అని ఫడణవీస్‌ అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న ఓబీసీ మంత్రులతో తనకు ఎలాంటి వైరంలేదని, ఓబీసీల సమస్యలపై వారు నిజాయతీగా ఉంటే పార్టీలతో సంబంధం లేకుండా వారి తరఫున నిలబడతామని ఫడణవీస్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని పూర్తి విశ్వాసంతోనే చెబుతున్నానన్నారు. తనకు అధికారం ఇస్తే వచ్చే మూడు, నాలుగు నెలల్లోనే ఓబీసీ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఒకవేళ తాను విఫలమైతే మాత్రం రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పారు. మహారాష్ట్రలోని స్థానిక సంస్థలలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లు మొత్తం సీట్లలో 50శాతానికి మించరాదని మార్చి 4న ఇచ్చిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఓబీసీల రిజర్వేషన్లను పరిరక్షించడంలో ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ భాజపా ఈ రోజు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దాదాపు 1000 చోట్ల ఆందోళనలు చేపట్టనున్నట్టు ఇటీవల ప్రకటించింది. అయితే, శనివారం ఉదయం పలు చోట్ల నిరసనలకు దిగిన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని