Dynasty Politics: కుటుంబాలు లేనివాళ్లకు ఆ బాధలెలా తెలుస్తాయ్‌..? అఖిలేశ్‌ యాదవ్‌

సమాజ్‌వాదీ పార్టీ ‘దోచుకునే కుటుంబ పార్టీ’ అంటూ భారతీయ జనతా పార్టీ చేస్తోన్న ప్రచారంపై ఎస్‌పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ స్పందించారు.

Published : 18 Feb 2022 18:15 IST

భాజపాపై విమర్శలు గుప్పించిన ఎస్‌పీ చీఫ్‌

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ దోచుకునే కుటుంబ పార్టీ అంటూ భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తోంది. వీటిపై స్పందించిన ఎస్‌పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌.. భాజపా విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కేవలం కుటుంబం ఉన్నవారికే వారి బాధలు తెలుస్తాయన్న ఆయన.. కుటుంబం లేనివారు ప్రజల కష్టాలు ఎలా అర్థం చేసుకోగలుగుతారు అని ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జాలౌన్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అఖిలేశ్‌ యాదవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘వాళ్లు (భాజపా) నన్ను కుటుంబ పార్టీకి చెందిన వాడిగా చెప్పుకుంటున్నారు. కుటుంబం ఉన్న వ్యక్తి కుటుంబ బాధలను అర్థం చేసుకోగలడు. భాజపా నాయకులకు ఎటువంటి కుటుంబం లేదు. అలాంటప్పుడు కుటుంబాల కష్టాలను వారు అర్థం చేసుకోగలరా..? కేవలం కుటుంబం ఉన్న వ్యక్తి మాత్రమే బాధ్యతలను అర్థం చేసుకోగలడు. ఆర్థిక మాంద్యాన్ని అర్థం చేసుకుంటాడు. ఇక్కడ కూర్చున్న వారిలో కుటుంబాలు కలిగిన వారికి ధరల పెరుగుదల బాధలు తెలుసు. ఉద్యోగాలు లేకపోవడం కలిగే బాధ యువతకు మాత్రమే తెలుసు’ అంటూ భాజపా నాయకులపై అఖిలేశ్‌ యాదవ్‌ ఘాటు విమర్శలు చేశారు. ఇక సామాన్య ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును కొందరు వ్యాపారవేత్తలు దోచుకొని విదేశాలకు పారిపోయారని ఆరోపించారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇదంతా జరుగుతోందన్నారు.

ఇక యూపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ‘ఎస్‌’ అంటే సంపద దోచుకోవడం, ‘పీ’ అంటే పరివార్‌ (కుటుంబం) అంటూ అఖిలేశ్‌ యాదవ్‌ కుటుంబంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా కుటుంబ పార్టీ అంటూ సమాజ్‌వాదీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇలా భాజపా చేస్తోన్న విమర్శలను ఎస్‌పీ చీఫ్‌ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలాఉంటే, ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 20న మూడో దశ పోలింగ్‌ జరుగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని