Nyay Yatra: ఝార్ఖండ్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా కుట్ర: రాహుల్‌ గాంధీ

రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ శుక్రవారం ఝార్ఖండ్‌లోకి ప్రవేశించింది. ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా యత్నించిందని ఆయన ఆరోపించారు.

Published : 02 Feb 2024 23:11 IST

రాంచీ: ఝార్ఖండ్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా యత్నించిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. అయితే, ఆ పార్టీ కుట్రలకు ‘ఇండియా’ కూటమి ఎదురొడ్డి నిలిచిందని పేర్కొన్నారు. మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) అరెస్టుతో ఝార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో రాహుల్ ఆధ్వర్యంలోని ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’ శుక్రవారం పశ్చిమ బెంగాల్‌ నుంచి ఝార్ఖండ్‌లోకి ప్రవేశించింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి చంపయీ సోరెన్‌ ఆయనకు స్వాగతం పలికారు. పాకుడ్‌ పట్టణంలో నిర్వహించిన సభలో రాహుల్‌ ప్రసంగించారు.

అలాంటి వారు పార్టీని వీడటం మంచిదే: రాహుల్‌ గాంధీ

‘‘భాజపాకు ధన బలం, దర్యాప్తు సంస్థల అండ ఉంది. నేను, నా పార్టీ మాత్రం వాటికి భయపడలేదు. విభజనవాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం. దేశంలో అన్యాయం రాజ్యమేలుతోంది. అధిక ధరలు సామాన్యుడి నడ్డివిరుస్తున్నాయి. నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. దేశంలో ఉపాధి కల్పనకు వెన్నెముకగా నిలిచిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల వినాశనానికి మోదీ సర్కారు చేసిన నోట్ల రద్దు, జీఎస్టీలే కారణం’’ అని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రైతులు, యువత, అణగారిన వర్గాలకు ఆర్థిక, సామాజిక న్యాయం కోసమే ఈ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. న్యాయ్ యాత్రకు పూర్తి మద్దతిస్తామని సీఎం చంపయీ సోరెన్‌ హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని