మళ్లీ ముంబయి ఇండియన్స్‌కు పార్థివ్‌

టీమ్‌ఇండియా మాజీ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌ పటేల్‌ మళ్లీ ముంబయి ఇండియన్స్‌లో చేరాడు. అయితే ఆటగాడిగా కాదండోయ్‌! ఆ జట్టు ప్రతిభాన్వేషకుడిగా ఎంపికయ్యాడు. భారత జట్టు తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడిన పార్థివ్‌ బుధవారమే అన్ని...

Published : 11 Dec 2020 01:32 IST

ఈ సారి ప్రతిభాన్వేషకుడిగా చేరిక

ముంబయి: టీమ్‌ఇండియా మాజీ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌ పటేల్‌ మళ్లీ ముంబయి ఇండియన్స్‌లో చేరాడు. అయితే ఆటగాడిగా కాదండోయ్‌! ఆ జట్టు ప్రతిభాన్వేషకుడిగా. భారత జట్టు తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడిన పార్థివ్‌ బుధవారమే అన్ని ఫార్మాట్లలో వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

‘దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో పార్థివ్‌కు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఐపీఎల్‌లో వేగంగా పెరుగుతున్న పోటీని అతడు అర్థం చేసుకోగలడు’ అని ముంబయి ఓ ప్రకటనలో తెలిపింది. మళ్లీ తమ బృందంలో చేరినందుకు ఆ ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ అభినందనలు తెలియజేశాడు.

‘ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్నప్పటి నుంచి మాకు అతడి తెలివితేటలు తెలుసు. అతడికున్న క్రికెట్‌ విజ్ఞానంతో మా ప్రతిభాన్వేషణ వ్యవస్థకు తోడ్పడగలడని మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మా ఆలోచనా విధానం పార్థివ్‌ అర్థం చేసుకుంటాడు. ముంబయిలో మేం ఏం చేయాలనుకుంటున్నామో అతడికి తెలుసు’ అని అంబానీ అన్నారు.

తనకు మరో అవకాశం ఇచ్చిన ముంబయికి  పార్థివ్‌ కృతజ్ఞతలు ప్రకటించాడు. ‘ముంబయి ఇండియన్స్‌కు ఆడుతూ నా క్రికెట్‌ను ఎంతో ఆస్వాదించాను. మూడు సార్లు ట్రోఫీలు అందుకోవడం నాకు మరుపురాని గుర్తులు. ఇప్పుడు నా జీవితలో సరికొత్త అధ్యాయానికి సమయం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబయికి ధన్యవాదాలు’ అని అన్నాడు. ఇకపై ప్రతిభాన్వేషణలో కోచింగ్‌ బృందానికి సాయంగా ఉండనున్నాడు.

ఇవీ చదవండి
‘కింగ్‌కోహ్లీ’.. భూమ్మీద బిజీ క్రికెటర్‌!
నెట్‌బౌలర్‌ నుంచి టీమ్‌ఇండియా పేసర్‌గా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని