WTC Final: యుద్ధం ఓడితే ఎంత పోరాడినా లాభంలేదు 

యుద్ధం గెలవకపోతే ఎంత మందిని ఓడించినా లాభంలేదని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇటీవల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత జట్టు ఓటమిపై స్పందిస్తూ అతడీ వ్యాఖ్యలు చేశాడు...

Updated : 27 Jun 2021 10:56 IST

ఆ ఒక్క గంటనే చరిత్ర గుర్తుంచుకుంటుంది: ఆకాశ్‌ చోప్రా

ఇంటర్నెట్‌డెస్క్‌: యుద్ధం గెలవకపోతే ఎంత మందిని ఓడించినా లాభంలేదని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇటీవల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత జట్టు ఓటమిపై స్పందిస్తూ అతడీ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీసేన రెండేళ్లుగా పడిన కష్టం.. సాధించిన విజయాలు ఒక్క సెషన్‌తో కనుమరుగయ్యాయని అన్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో చోప్రా మాట్లాడాడు.

‘టీమ్‌ఇండియా చివరిరోజు (రిజర్వ్‌డే) ఎలాగైనా ఫలితం సాధించాలనే పట్టుదలతో ఆటను ప్రారంభించి ఉండొచ్చు. అయితే, తొలి గంటలో కెప్టెన్‌ కోహ్లీ, చెతేశ్వర్‌ పుజారా ఔటవ్వడంతో మ్యాచ్‌పై పట్టుకోల్పోయింది. ఇదే భారత జట్టు గత ఐదేళ్లుగా టెస్టు ర్యాంకింగ్స్‌లో వరుసగా టాప్‌లో నిలుస్తూ వచ్చింది. కానీ, దురదృష్టం కొద్దీ సరిగ్గా ఆడలేకపోయిన ఆ ఒక్క గంటనే చరిత్ర గుర్తుంచుకుంటుంది. ఏ జట్టు, కెప్టెన్‌ పేరు ప్రఖ్యాతలైనా వారు సాధించిన విజయాలపైనే ఆధారపడి ఉంటాయి. అలాగే యుద్ధం గెలవకపోతే ఎంత మందితో పోరాడినా ఉపయోగం లేదు’ అని చోప్రా పేర్కొన్నాడు.

కాగా, టీమ్‌ఇండియా గతరెండేళ్లుగా ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో కివీస్‌తో మినహా అన్ని జట్లపైనా వరుస విజయాలు సాధించింది. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచి చివరికి అదే న్యూజిలాండ్‌తో తుదిపోరులో తలపడాల్సి వచ్చింది. వర్షం అంతరాయంతో ప్రతికూల పరిస్థితుల్లో పోరాడింది. చివరి రోజు వరకూ ఫలితం ఇరు జట్లకు సమానంగా ఉంది. అయితే, రిజర్వ్‌డే రోజు కోహ్లీ, పుజారా ఔటయ్యాక భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 32 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని న్యూజిలాండ్‌ చివరికి 138 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(52), రాస్‌టేలర్‌(47) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని