Afghanistan: ప్రపంచకప్‌లో మా నెక్ట్స్‌ టార్గెట్‌ అదే: అఫ్గానిస్థాన్‌ కోచ్

ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ (Afghanistan) మేటి జట్లకు షాక్‌లు ఇస్తోంది. మొన్న ఇంగ్లాండ్, పాక్‌లను ఓడించిన ఆ జట్టు.. తాజాగా శ్రీలంకను మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో తమ తదుపరి లక్ష్యమేంటో అఫ్గాన్‌ హెడ్‌కోచ్ జోనాథన్ ట్రాట్ (Jonathan Trott) వెల్లడించాడు.

Published : 31 Oct 2023 18:56 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో మేటి జట్లకు అఫ్గానిస్థాన్‌ (Afghanistan) గట్టి షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్, పాకిస్థాన్‌లను ఓడించిన ఆ జట్టు తాజాగా శ్రీలంకను బెంబేలెత్తించింది. తొలుత శ్రీలంకను 241 పరుగులకే కట్టడి చేసిన అఫ్గానిస్థాన్‌.. ఈ లక్ష్యాన్ని మూడే వికెట్లు కోల్పోయి 45.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకొచ్చి సెమీస్ రేసులో నిలిచింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అఫ్గాన్‌ విజయం సాధిస్తే టాప్‌-4లో నిలిచే అవకాశముంది. ఇదిలా ఉండగా.. ప్రపంచకప్‌లో తమ తదుపరి లక్ష్యమేంటో అఫ్గాన్‌ హెడ్‌కోచ్ జోనాథన్ ట్రాట్ (Jonathan Trott) వెల్లడించాడు. అఫ్గాన్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా వాటిని సెంచరీలుగా మల్చలేకపోతున్నారని పేర్కొన్నాడు. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అఫ్గాన్‌ బ్యాటర్ల దృష్టి శతకం చేయడంపైనే ఉంటుందని జోనాథన్‌ ట్రాట్ తెలిపాడు.

‘‘టోర్నమెంట్‌లో ఇప్పటివరకు చాలామంది సెంచరీలు చేశారు. కానీ, మా జట్టు తరఫున ఎవరూ శతకం సాధించలేదు. కాబట్టి.. మా నెక్ట్స్ టార్గెట్ అదే. ఎవరో ఒకరు ఈ బాధ్యత తీసుకుని ఆడతారు. ఎక్కువ సమయం క్రీజులో గడుపుతారు. మా ఆటగాళ్లు సెంచరీ చేస్తారనే నమ్మకం నాకుంది. భవిష్యత్‌లో వీరు సెంచరీలు చేయగలరనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. తదుపరి మ్యాచ్‌ నుంచే ఇది ప్రారంభమవుందని ఆశిస్తున్నా’’ అని హెడ్‌కోచ్ జోనాథన్ వివరించాడు. ప్రపంచకప్‌లో  రెహ్మనుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జాద్రాన్‌, రహమత్‌ షా సెంచరీలకు చేరువైనా ఆ ఫీట్‌ని సాధించలేకపోయారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని