Ashutosh Sharma: 11 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ.. యువరాజ్‌ సింగ్ రికార్డు బ్రేక్

భారత టీ20 క్రికెట్ (T20 Cricket) చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. 16 ఏళ్ల కిందట టీ20ల్లో యువరాజ్‌ సింగ్ (Yuvraj Singh) నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ (12 బంతుల్లో) రికార్డు బద్దలైంది.

Published : 18 Oct 2023 01:42 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 క్రికెట్ (T20 Cricket) చరిత్రలో  సరికొత్త రికార్డు నమోదైంది. 16 ఏళ్ల కిందట టీ20ల్లో యువరాజ్‌ సింగ్ (Yuvraj Singh) నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్‌ సెంచరీ (12 బంతుల్లో) రికార్డు బద్దలైంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గ్రూప్‌ సిలో అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్‌ మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్‌ అశుతోష్‌ శర్మ (Ashutosh Sharma).. యువీ రికార్డును బ్రేక్‌ చేశాడు. 25ఏళ్ల అశుతోష్‌ శర్మ 11 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఎనిమిది సిక్స్‌లు, ఒక ఫోర్ ఉన్నాయి. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే అశుతోష్‌ పెవిలియన్‌ చేరాడు. 

రైల్వేస్‌ ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్లు మిగిలి వుండగా అశుతోష్ క్రీజులోకి వచ్చాడు. అప్పటి స్కోరు 131/4. ఈ క్రమంలో క్రీజులో ఉన్న ఉపేంద్ర యాదవ్‌ (103*; 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లు), అశుతోష్‌ సిక్సర్లతో విరుచుకుపడటంతో చివరి ఐదు ఓవర్లలో రైల్వేస్ 115 పరుగులు రాబట్టి 246/5తో ఇన్నింగ్స్‌ను ముగించింది. లక్ష్యఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ 119 పరుగులకే ఆలౌటైంది. దీంతో 127 పరుగుల తేడాతో రైల్వేస్ ఘన విజయం సాధించింది. 

2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్ 12 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాది రికార్డు సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనే యువీ ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదాడు. ఇదిలా ఉండగా..  సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో రికార్డు నమోదైంది. భారత టీ20 చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా పంజాబ్‌ నిలిచింది. ఆంధ్రా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో  275/6 స్కోరు చేసింది. 2019లో ముంబయి జట్టు.. సిక్కింపై 258/4 స్కోరు చేసిన రికార్డును ఇప్పుడు పంజాబ్‌ బ్రేక్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని