Ashwin on Bumrah: టెస్టుల్లో బుమ్రా నం.1.. నేను అతడికి పెద్ద అభిమానిని: అశ్విన్

భారత సీనియర్‌ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ (Ashwin) సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటాడు. తాజాగా పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Updated : 11 Feb 2024 15:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (Bumrah) టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు వరకు రవిచంద్రన్ అశ్విన్‌దే (Ravichandran Ashwin) ఆ స్థానం. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో (IND vs ENG) బుమ్రా ఏకంగా 9 వికెట్లు తీసి భారత్‌ను గెలిపించాడు. దీంతో అతడు ర్యాంకింగ్స్‌లో పైకి వచ్చేయగా.. అశ్విన్ మూడో స్థానానికి పడిపోయాడు. ఈ క్రమంలో బుమ్రా ర్యాంకు, గిల్ సెంచరీ, అండర్-19 వరల్డ్‌ కప్‌లో భారత కెప్టెన్ ఉదయ్‌ సహరన్‌పై అశ్విన్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

‘‘ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో బూమ్‌బాల్ చూశాం. అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. కేవలం రెండు టెస్టుల్లోనే 14 వికెట్లు తీశాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరాడు. నేను అతడికి అతిపెద్ద ఫ్యాన్‌ని. హిమాలయమంత ఘనతను సాధించాడు. ఇంగ్లాండ్‌పై రెండో టెస్టులో సెంచరీ చేసిన గిల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అతడు చాలా ప్రతిభావంతుడు. ఇటీవల నాలుగు రోజుల్లోపే టెస్టు మ్యాచ్‌లు ముగుస్తున్నాయి. అయితే, నాణ్యమైన ప్రదర్శనతోపాటు ఇరు జట్లూ పోటీపడటం వల్ల ఫలితం త్వరగానే వచ్చేస్తోంది. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచాం. ఆసీస్-ఇంగ్లాండ్ మధ్య 2005లో జరిగిన యాషెస్‌ సిరీస్‌ చూశా. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో ఆడుతుంటే నాకు అదే గుర్తుకొస్తోంది. రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు ఆడనున్నాం. పుజారా ఏమైనా డిన్నర్‌కు ఆహ్వానిస్తాడేమో చూడాలి. రవీంద్ర జడేజాది కూడా సొంతమైదానమే. కానీ, జడ్డూ జామ్‌నగర్‌లో ఉంటాడు’’ అని అశ్విన్ తెలిపాడు. 

రింకు సింగ్‌తో ఉదయ్‌ సహరన్‌కు పోలిక

‘‘అభిమానులు కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌ను రింకు సింగ్‌తో పోలుస్తూ ఉంటారు. అండర్ 19 వరల్డ్‌ కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్. మ్యాచ్‌లను గెలిపించడంలోనూ ముందున్నాడు. సెమీస్‌లో ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. రింకు సింగ్‌ కూడా లోయర్ ఆర్డర్‌లో అదరగొట్టాడు. ఇలాంటి టాలెంట్‌ను డబ్బుతో కొనలేం. అతడి ఆటపై ఉదయ్‌కు పూర్తి నమ్మకం ఉంది. వీరిద్దరూ ఎంతో ప్రశాంతంగా ఆడేస్తారు’’ అని భారత సీనియర్‌ స్పిన్నర్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని