Ashwin- Dravid: వెయిటర్‌తో ద్రవిడ్‌ గంటపాటు చర్చ.. ఎందుకంటే..!

భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు (Rahul Dravid) ఆటపై ఉన్న ఆసక్తి, అభిరుచి ఏ స్థాయిలో ఉంటుందో రవిచంద్రన్ అశ్విన్‌ గుర్తు చేసుకున్నాడు. ఎవరితోనైనా కలిసిపోయి క్రికెట్‌ గురించి చర్చిస్తాడనేందుకు ఇదొక ఉదాహరణగా పేర్కొన్నాడు.

Published : 13 Jul 2023 10:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యాషెస్ సిరీస్‌లో (Ashes Series) భాగంగా ఇంగ్లాండ్ - ఆసీస్ (ENG vs AUS) మధ్య మూడు టెస్టులు ముగియగా.. నాలుగో మ్యాచ్‌ జులై 19 నుంచి మాంచెస్టర్‌ వేదికగా ప్రారంభం కానుంది. అయితే, ఇప్పటికీ జానీ బెయిర్‌స్టో ఔట్‌ వివాదం కొనసాగుతూనే ఉంది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొందరు వాదిస్తుండగా.. మరి కొందరు నిబంధనల ప్రకారం సక్రమమే అంటూ మద్దతుగా నిలిచే వారూ ఉన్నారు. ఈ క్రమంలో భారత సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ అలెక్స్ కేరీని అభినందించాడు. తాజాగా ఇదే విషయంపై రాహుల్‌ ద్రవిడ్‌ - ఓ వెయిటర్‌కు మధ్య జరిగిన సంభాషణను అశ్విన్‌ వెల్లడించాడు. 

‘‘ఓ రోజు మేం బీచ్‌లో కూర్చొని ఉన్నాం. రాహుల్‌ భాయ్ నాకొక లెమన్‌ జ్యూస్ తెప్పించారు. దాదాపు ఒక గంటపాటు బెయిర్‌స్టో ఔట్‌పై సర్వర్, వెయిటర్‌తో ద్రవిడ్ చర్చించాడు. నిబంధనల గురించి మాట్లాడుకున్నారు. క్రీడా స్ఫూర్తి వంటి అంశాలపై చర్చించారు. ఇలాగే గంటపాటు సంభాషణ కొనసాగింది. వారికి క్రికెట్‌పై ఉన్న మక్కువ చూసిన తర్వాత ఆశ్చర్యమేసింది. ఇంతలో ఓ పెద్దాయన వచ్చి ‘ఆ బెయిర్‌స్టో ఔటేనండి ’ అంటూ అతడి యాసలో చెప్పేయడంతో చర్చ ముగిసింది’’ అని అశ్విన్‌ గుర్తు చేసుకున్నాడు. 

టీమ్‌ఇండియా ఆటగాళ్లు వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడేందుకు భారత్ ఇక్కడికి వచ్చింది. ప్రస్తుతం డొమినికా వేదికగా మొదటి టెస్టు తొలి రోజు ఆట కూడా ముగిసింది. విండీస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌట్‌ కాగా.. భారత్ 80/0 స్కోరుతో కొనసాగుతోంది. క్రీజ్‌లో యశస్వి (40*), రోహిత్ (30*) ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు