WI vs IND: అశ్విన్‌ జోరు.. విండీస్‌ విలవిల.. తొలిరోజు భారత్‌దే ఆధిపత్యం

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. తొలుత విండీస్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. బ్యాటింగ్‌లోనూ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది.

Updated : 13 Jul 2023 04:09 IST

డొమినికా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా (Team India)కు అదిరే ఆరంభం లభించింది. తొలుత విండీస్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. బ్యాటింగ్‌లోనూ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (30), యశస్వి జైస్వాల్ (40) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 70 పరుగుల వెనుకంజలో ఉంది. విండీస్‌ ప్లేయర్లలో అరంగేట్ర ఆటగాడు అథనేజ్ (47) మినహా మిగతావారు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. బ్రాత్ వైట్ (20), జేసన్‌ హోల్డర్‌ (18), బ్లాక్‌ వుడ్ (14), త్యాగ్‌నారాయణ్ చందర్‌ పాల్ (12), రఖీమ్‌ కార్నివాల్ (19*) పరుగులు చేశారు. సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్‌ మాయాజాలంతో ఐదు వికెట్లు పడగొట్టి విండీస్‌ పతనంలో కీలకపాత్ర పోషించాడు. జడేజా 3, సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్‌ 10 ఓవర్లకు 29/0తో నిలవడంతో మంచి స్కోరే చేసేలా కనిపించింది. కానీ, నిలకడగా ఆడుతున్న త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్ (12)ను అశ్విన్‌ క్లీన్‌బౌల్డ్ చేసి విండీస్‌ పతనానికి నాంది పలికాడు. తర్వాత విండీస్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్రాత్‌వైట్‌ (20).. అశ్విన్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు చిక్కాడు. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 20వ ఓవర్లో రీఫర్‌ (2) వికెట్‌ కీపర్‌ ఇషాన్‌కు  క్యాచ్‌ ఇచ్చాడు. లంచ్‌ బ్రేక్‌కు ముందు  బ్లాక్‌వుడ్(14) జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. మహ్మద్‌ సిరాజ్‌ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో బ్లాక్‌వుడ్ పెవిలియన్‌ బాటపట్టాడు. 

తొలి సెషన్‌లో 68/4తో నిలిచిన విండీస్‌.. రెండో సెషన్‌లోనూ పోరాడలేకపోయింది. జడేజా వేసిన 32 ఓవర్‌లో జోష్వా ద సిల్వా (2) వికెట్ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో అథనేజ్, జేసన్ హోల్డర్ నిలకడగా ఆడటంతో స్కోరు 100 దాటింది. అయితే భాగస్వామ్యం బలపడుతున్న దశలో హోల్డర్‌ను సిరాజ్‌ ఔట్‌ చేశాడు. కాసేపటికే అల్జారి జోసెఫ్‌ (4)తో పాటు అథనేజ్‌లను అశ్విన్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేర్చాడు. దీంతో టీ విరామ సమయానికి విండీస్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. చివరి సెషన్‌లో  కీమర్ రోచ్‌ (1) జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా.. వారికన్ (0)ను అశ్విన్‌ ఔట్‌ చేయడంతో విండీస్‌ ఆలౌటైంది.

తండ్రీకొడుకులిద్దరినీ..: భారత సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో తండ్రీకొడుకులిద్దరినీ ఔట్‌ చేసిన అయిదో బౌలర్‌గా నిలిచాడు. విండీస్‌తో తొలి టెస్టు తొలి రోజు త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌ను బౌల్డ్‌ చేయడంతో అతడికీ ఈ ఘనత దక్కింది. 2011లో దిల్లీలో అరంగేట్రం చేసిన అశ్విన్‌..  ఆ మ్యాచ్‌లో త్యాగ్‌నారాయణ్‌ తండ్రి శివ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌ను ఔట్‌ చేశాడు. అప్పుడు చందర్‌పాల్‌ను అతడు ఎల్బీగా వెనక్కి పంపాడు. మిచెల్‌ స్టార్క్‌ (ఆస్ట్రేలియా), సిమోన్‌ హార్మర్‌ (దక్షిణాఫ్రికా) కూడా త్యాగ్‌నారాయణ్‌, శివ్‌నారాయణ్‌లను ఔట్‌ చేశారు.

అశ్విన్‌ @ 700

అశ్విన్‌ 700వ అంతర్జాతీయ వికెట్‌ సాధించాడు. బుధవారం అల్జారి జోసెఫ్‌ను ఔట్‌ చేసి అతనీ ఘనతను అందుకున్నాడు. భారత్‌ నుంచి ఇప్పటిదాకా అనిల్‌ కుంబ్లే (953), హర్భజన్‌ సింగ్‌ (707) మాత్రమే ఈ క్లబ్‌లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని