Updated : 15/11/2021 00:39 IST

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో ఘన చరిత్ర కలిగిన జట్టు.. వన్డేల్లో తిరుగులేని రికార్డు.. ఐదు ప్రపంచకప్‌ టైటిల్స్‌ను గెలుచుకుంది.. ఒకప్పుడు ఆ జట్టంటే ప్రత్యర్థికి హడల్‌.. క్రికెట్‌లో రారాజుగా వెలుగొందిన ఆ జట్టుకు టీ20లు పెద్దగా అచ్చిరాలేదేమో.. చిన్నజట్ల చేతిలోనూ సిరీస్‌లను కోల్పోయింది. కీర్తిప్రతిష్ఠలు క్రమంగా మసకబారుతున్న వేళ  అద్భుతం సృష్టించింది. ఫేవరేట్లను కాదని సమష్ఠిగా రాణించి తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది.. దాదాపు పద్నాలుగేళ్ల తమ నిరీక్షణకు తెరదించుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు. 

 న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ (48 బంతుల్లో 85: పది ఫోర్లు, మూడు సిక్సర్లు) చెలరేగాడు. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్‌ మార్ష్‌ (50 బంతుల్లో 77 నాటౌట్: ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌ (38 బంతుల్లో 53: నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) వీరవిహారం చేశారు. ట్రెంట్ బౌల్ట్‌  (2/18) మినహా మిగతా బౌలర్లు విఫలమయ్యారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఆసీస్‌ బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్, ప్లేయర్ ఆఫ్‌ ద టోర్నమెంట్‌గా డేవిడ్ వార్నర్ ఎంపికయ్యారు.

కీలకమైన టాస్‌..

మరోసారి ఈ మ్యాచ్‌లో టాస్‌ కీలకంగా మారింది. టాస్‌ నెగ్గిన ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే మొదటి పది ఓవర్లపాటు ఆచితూచి ఆడిన న్యూజిలాండ్‌.. ఆఖర్లో మాత్రం దుమ్మురేపింది. దీనికి కారణం ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్‌ మొదట్లో నిదానంగా ఆడాడు. ఒక్కసారిగా గేర్లు మార్చి ఆసీస్‌ బౌలర్లను తుత్తునీయలు చేశాడు. చివరి పది ఓవర్లలో 115 పరుగులు వచ్చాయంటే కేన్‌ బ్యాటింగ్‌ మహిమే. అయితే తొలి శతకం నమోదు చేసుకుంటాడనుకుంటే భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. మిగతా బ్యాటర్లలో గప్తిల్ 28, మిచెల్‌ 11, ఫిలిప్స్‌ 18, నీషమ్ 13 నాటౌట్‌,  సీఫర్ట్ 8 నాటౌట్‌ పరుగులు సాధించారు. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, జంపా ఒక వికెట్ పడగొట్టారు. స్టార్క్‌ (4-0-60-0) తేలిపోయాడు. 

కసిగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్

173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (5) త్వరగానే పెవిలియన్‌కు చేరాడు. అయితే ఆ ఆనందం కివీస్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. డేవిడ్‌ వార్నర్‌తో కలిసి మిచెల్ మార్ష్ స్వైరవిహారం చేశారు. జట్టుకు కప్‌ అందించాలనే కసితో ఉన్న వీరిద్దరూ కివీస్‌ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో అర్ధశతకాలు నమోదు చేసుకున్నారు. విజయం ఖాయమైన సమయానికి వార్నర్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్‌ (28*)తో కలిసి మరో వికెట్ పడనీయకుండా మార్ష్ జట్టును విజయతీరాలను చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్‌ ట్రెంట్ బౌల్ట్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఆసీస్‌ గెలుచుకున్న ఐసీసీ టోర్నీలు
* వన్డే ప్రపంచకప్‌లు (5): 1987, 1999, 2003, 2007, 2015
* ఛాంపియన్స్ ట్రోఫీ  (2): 2006, 2009
* టీ20 ప్రపంచకప్‌ : 2021


ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని