SA vs AUS: ‘కంగారు’ పడినా ఫైనల్‌కు.. పోరాడి ఓడిన సఫారీలు

వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. సౌతాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీ ఫైనల్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Updated : 16 Nov 2023 23:55 IST

కోల్‌కతా: వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023) రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా(Australia) విజయం సాధించింది. కోల్‌కతా(Kolkata) వేదికగా సౌతాఫ్రికా(South Africa)తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో మూడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యఛేదనలో తొలుత దూకుడుగా ఆడిన ఆసీస్‌.. క్రమంగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. అయితే ఒత్తిడిని తట్టుకుంటూ ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్‌లో ఓడిపోవడం ఇది ఐదోసారి. 1992, 1996, 2007, 2015లోనూ సఫారీలు సెమీస్‌లో ఓడిపోయారు. దీంతో ఆదివారం జరగనున్న ఫైనల్‌లో భారత్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది.

213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆస్ట్రేలియాకు ట్రావిస్ హెడ్ (62; 48 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (29; 18 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) అదిరే ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదడంతో 6 ఓవర్లకు స్కోరు 60కి చేరింది. దీంతో ఆస్ట్రేలియా సునాయసంగా విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ, వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న వార్నర్‌ని మార్‌క్రమ్‌ క్లీన్‌బౌల్డ్ చేశాడు. రబాడ వేసిన తర్వాతి ఓవర్‌లో మిచెల్ మార్ష్‌ (0)ని వెనక్కి పంపాడు. డసెన్ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో మార్ష్‌ పెవిలియన్ చేరాడు.

మరోవైపు, ట్రావిస్‌ హెడ్ దూకుడు కొనసాగించాడు. కోయెట్జీ వేసిన 12 ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు అర్ధ శతకం పూర్తి చేసుకున్న హెడ్‌.. కొద్దిసేపటికే ఔటయ్యాడు. మార్‌క్రమ్‌ బౌలింగ్‌లో అతడు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత షంసి తన వరుస ఓవర్లలో  లబుషేన్‌ (18), మ్యాక్స్‌వెల్ (1)ని ఔట్‌ చేసి ఆసీస్‌కు షాక్‌ ఇచ్చాడు. దీంతో 137 పరుగులకు ఆసీస్ ఐదు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

ఈ క్రమంలో ఇంగ్లిస్‌ (28), స్టీవ్ స్మిత్ (30) నిలకడగా ఆడి జట్టుని విజయం దిశగా నడిపించారు. అయితే, వీరిద్దరిని ఔట్‌ చేయడంతో కొయెట్జీ ఔట్‌ చేయడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ క్రమంలో 40 ఓవర్లకు స్కోరు 193/7కి చేరింది. తర్వాత సౌతాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. మిచెల్ స్టార్క్ (16; 38 బంతుల్లో), కమిన్స్ (14; 29 బంతుల్లో 2 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.

సౌతాఫ్రికా బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ (101; 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. హెన్రిచ్ క్లాసెన్ (47) రాణించాడు. మిగతా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌, కమిన్స్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. హేజిల్‌వుడ్‌, హెడ్‌ చెరో 2 వికెట్లు తీశారు.

  • ఆసీస్ ఫైనల్‌కు రావడం ఇది ఎనిమిదోసారి. 1987, 1999, 2003, 2007, 2015లో ఛాంపియన్‌గా నిలిచింది. 1975, 1996లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు