AUS vs SL: ఆసీస్‌ బోణీ.. శ్రీలంకపై ఘన విజయం

వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌ బోణీ కొట్టింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 16 Oct 2023 21:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌ బోణీ కొట్టింది. లఖ్‌నవూ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనూ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకొని 210 పరుగుల లక్ష్యాన్ని 35.2 ఓవర్లలో ఛేదించింది. మిచెల్‌ ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (52; 51 బంతుల్లో 9×4), జోష్‌ ఇంగ్లిష్‌ (58; 59 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. మార్నస్‌ లబుషేన్‌ (40), మాక్స్‌వెల్‌ (31*) రాణించారు. స్టాయినిస్‌ (20*; 10 బంతుల్లో 2×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో మధుశనక మూడు వికెట్లు పడగొట్టగా, దునిత్‌ ఒక వికెట్‌ తీశాడు.

వారిద్దరూ నిరాశపరిచినా..

లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్‌ తగిలింది. మధుశనక వేసిన 3.1వ బంతికి డేవిడ్‌ వార్నర్‌ (11) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అదే ఓవర్‌ చివరి బంతికి తొలి డౌన్‌లో వచ్చిన స్టీవెన్‌ స్మిత్‌ (0) కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఒకే ఓవర్లో 2 కీలక వికెట్లు కోల్పోవడంతో జట్టు ఒక్కసారిగా కష్టాల్లోకి జారుకుంది. కానీ, రెండో డౌన్‌లో వచ్చిన లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకుంటూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టు స్కోరు 81 పరుగుల వద్ద మిచెల్‌ మార్ష్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

జోష్‌ ఇంగ్లిష్ ‘జోష్‌’

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోష్‌ ఇంగ్లిష్‌ మరింత దూకుడుగా ఆడాడు. వచ్చీ రాగానే వరుసగా రెండు బౌండరీలు బాది.. శ్రీలంక బౌలర్లలో భయం పుట్టించారు. అదే జోరును కొనసాగిస్తూ.. 47 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని మళ్లీ మధుశనకే విడగొట్టాడు. 40పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లబుషేన్‌ భారీషాట్‌కు ప్రయత్నించి కరుణరత్నేకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే ఇంగ్లిష్‌ కూడా దునిత్‌ వెల్లలాగే బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్‌ (31*), స్టాయినిస్‌ (20*) లక్ష్యాన్ని పూర్తి చేశారు.

అంతకుముందు టాస్‌ గెలిచిన తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక జట్టు 209 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (61), కుశాల్‌ పెరీరా (78) తప్ప ఇంకెవరూ రాణించలేదు. చరిత్‌ అసలంక (25) ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌(9), సదీర సమరవిక్రమ (8), ధనంజయ డిసిల్వా (7), దునిత్‌ వెల్లలాగే (2), చమిక కరుణరత్నే (2), మహీశ్‌ తీక్షణ (0), లాహిరు కుమార (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా 4 వికెట్లతో రాణించాడు. పాట్‌ కమిన్‌, మిచెల్‌ స్టార్క్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఒక వికెట్‌ తీశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని