Axar Patel: అక్షర్ పటేల్ వరల్డ్ క్లాస్ పవర్‌ హిట్టర్‌: షేన్‌ వాట్సన్‌

ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఆశించిన మేరకు రాణించకపోయినా ఆ జట్టు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) నిలకడగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో అక్షర్‌పై దిల్లీ అసిస్టెంట్ కోచ్ షేన్‌ వాట్సన్‌ ప్రశంసలు కురిపించాడు. 

Published : 24 Apr 2023 18:15 IST

ఇంటర్నెట్ డెస్క్: దిల్లీ క్యాపిటల్స్‌ (DC) ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌ (Axar Patel)పై ఆ జట్టు అసిస్టెంట్ కోచ్‌ షేన్‌ వాట్సన్‌ (Shane Watson) ప్రశంసలు కురిపించాడు. కొన్నాళ్లపాటు మనం అక్షర్‌ను మంచి బౌలర్‌గా మాత్రమే చూశామని, తర్వాత అతడు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతూ మ్యాచ్‌ విన్నర్‌గా మారాడని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓటమిపాలైనప్పటికీ.. అక్షర్‌ పటేల్ 16, 36, 2, 54, 21, 19* స్కోర్లతో తన క్లాస్‌ ఆటతీరును ప్రదర్శించాడని వాట్సన్‌ వివరించాడు.

‘‘అక్షర్ పటేల్‌ను మనం మొదట కొన్ని సంవత్సరాలు మంచి నైపుణ్యం కలిగిన బౌలర్‌గా చూశాం. దాంతో అతడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు అక్షర్‌ పటేల్ వరల్డ్ క్లాస్‌ పవర్ హిట్టర్, బ్యాటర్‌. ఇటీవల ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌లో ఎలా ఆడాడో మనం చూశాం.  ఇప్పుడు ఐపీఎల్‌లోనూ రాణిస్తున్నాడు. ఇది అతని నైపుణ్యానికి, అంకితభావానికి నిదర్శనం. అక్షర్‌ పటేల్ పార్ట్‌టైమ్ బౌలర్లను కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటున్నాడు’’ అని షేన్‌ వాట్సన్‌ పేర్కొన్నాడు.

వెటరన్ ఫాస్ట్ బౌలర్‌ ఇషాంత్ శర్మ గురించి మాట్లాడుతూ..  ‘‘ఆటగాడిగా ప్రత్యర్థి జట్టులో ఉండి ఇషాంత్ శర్మ బౌలింగ్‌ని ఆస్వాదించాను. ఇప్పుడు అతనితో కోచింగ్ స్టాఫ్‌గా పని చేయడం నమ్మశక్యంగా లేదు. అతను కచ్చితంగా మా జట్టులో, ముఖ్యంగా పవర్‌ప్లేలో కీలక పాత్ర పోషిస్తాడు. ఇషాంత్ శర్మలో ఇంకా చాలా టీ20 క్రికెట్ మిగిలి ఉంది’’ అని వాట్సన్‌ వివరించాడు. ఇదిలా ఉండగా, నేటి సాయంత్రం ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో దిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న ఈ ఇరుజట్లకు ఇక నుంచి ప్రతి మ్యాచ్‌ కీలకమే. ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే వరుసగా విజయాలు నమోదు చేయాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని