Pant- Axar Patel: పంత్‌కు యాక్సిడెంట్‌.. నా సోదరి ఫోన్‌ చేసినప్పుడు అలా అనుకున్నా: అక్షర్ పటేల్

ఏడాది క్రితం ఓ పిడుగు లాంటి వార్త క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఆనాటి ఘటనను అక్షర్‌ పటేల్‌ గుర్తుచేసుకుంటూ ఓ వీడియో పోస్టు చేశాడు.

Updated : 31 Dec 2023 11:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఏడాది క్రితం డిసెంబర్‌ 30న భారత స్టార్‌ ఆటగాడు రిషభ్‌ పంత్ (Rishabh Pant) రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కొత్త ఏడాది రోజున ఇంట్లో వారికి సర్‌ప్రైజ్‌ ఇద్దామని దిల్లీ నుంచి ఒంటరిగా పంత్‌ బయల్దేరగా.. దిల్లీ-రూర్కీ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే ఇతర వాహనదారులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ గాయాల నుంచి పంత్‌ కోలుకుని ఫిట్‌నెస్‌ కోసం శ్రమిస్తున్నాడు. గత ఏడాదిగా క్రికెట్‌కు దూరమైన పంత్‌ మళ్లీ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో దిల్లీ జట్టు సహచరుడు అక్షర్ పటేల్ మాట్లాడిన ఓ వీడియోను ఆ ఫ్రాంచైజీ షేర్‌ చేసింది.

‘‘ఆరోజు ఉదయం ఏడు గంటల సమయంలో నాకు మా సోదరి నుంచి ఫోన్‌ వచ్చింది. పంత్‌తో నువ్వు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడావు? అని అడిగింది. ముందు రోజే మాట్లాడాలని అనుకున్నప్పటికీ కుదరలేదని చెప్పా. వెంటనే పంత్‌ అమ్మగారి ఫోన్‌ నంబర్‌ ఉంటే పంపించమని నన్ను అడిగింది. ఎందుకు అని అడిగితే.. పంత్‌కు ప్రమాదం జరిగిందని చెప్పింది. ఆ మాట వినగానే షాక్‌కు గురయ్యా. ఒక్కసారిగా భయం ఆవరించింది. పంత్‌కు ఏదో జరిగిపోయిందని భావించా’’ అని అక్షర్‌ పటేల్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆనాటి ఘటనను అతడు తాజాగా గుర్తుచేసుకున్నాడు.

ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంత్‌ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి క్రికెట్‌ ఆడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవల ఐపీఎల్‌ వేలం సందర్భంగా రిషభ్‌ దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున దుబాయ్‌ వచ్చిన విషయం తెలిసిందే. తాను కోలుకుంటున్న వీడియోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తున్నాడు. తాజాగా దిల్లీ క్యాపిటల్స్ షేర్‌ చేసిన వీడియోలో అక్షర్ పటేల్‌తోపాటు దిల్లీ మెంటార్‌ సౌరభ్‌ గంగూలీ, కోచ్‌ రికీ పాంటింగ్‌ కూడా పంత్‌ ఆరోగ్యపరిస్థితిపై స్పందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని