Benstokes Retire: వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన బెన్‌స్టోక్స్

ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కొద్దిసేపటి క్రితం ఓ ట్వీట్‌ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు...

Updated : 18 Jul 2022 20:18 IST

లండన్‌: ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కొద్దిసేపటి క్రితం ఓ ట్వీట్‌ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ ఫార్మాట్‌లో జట్టుకు ఇకపై అత్యుత్తమ సేవలు అందించలేనని అందులో పేర్కొన్నాడు. దీంతో మంగళవారం దక్షిణాఫ్రికాతో ఆడేదే తన చివరి వన్డే అని తెలిపాడు. కాగా, ఇంగ్లాండ్‌ 2019 వన్డే ప్రపంచకప్‌ గెలవడంలో బెన్‌స్టోక్స్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల అతడు టీమ్‌ఇండియాతో ఆడిన వన్డే సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

ఇంగ్లాండ్‌ తరఫున మంగళవారం ఆడేదే నా చివరి వన్డే. ఈ ఫార్మాట్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. జట్టు సభ్యులతో కలిసి ఇక్కడ ఆడటం ప్రతి క్షణం ఆస్వాదించా. ఈ ప్రయాణంలో ఎన్నో మధురానుభూతులు దొరికాయి. వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం కష్టమే అయినా, జట్టుకు వంద శాతం నా ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాననే నిజాన్ని అంగీకరించడం దాని కన్నా పెద్దదేమీ కాదు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మూడు ఫార్మాట్లు ఆడటం వీలు కావట్లేదు. శారీరకంగా ఇబ్బందికి గురవ్వడమే కాకుండా జట్టులో మరో నాణ్యమైన ఆటగాడి చోటును కూడా లాగేసుకుంటున్నట్లు ఉంది. నా స్థానంలో వచ్చే ఆటగాడు ఇంగ్లాండ్‌ జట్టుకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆశిస్తున్నా

- బెన్‌ స్టోక్స్‌

ఈ నిర్ణయంతో అటు టెస్టు క్రికెట్‌తో పాటు ఇటు టీ20లకు కూడా పూర్తి స్థాయిలో నిబద్దతగా ఆడతానని నమ్ముతున్నానన్న బెన్‌ స్టోక్స్‌... ఈ సందర్భంగా కొత్త సారథి జోస్‌ బట్లర్‌కు, జట్టు సహాయక సిబ్బందికి అభినందనలు చెప్పాడు. ‘‘ఇప్పటివరకు 104 వన్డేలు ఆడిన నేను ఇంకా ఒక మ్యాచ్‌ ఆడతాను. నా హోమ్‌గ్రౌండ్‌ డర్హమ్‌లో ఈ మ్యాచ్‌ ఆడటం సంతోషంగా ఉంది. నాకు ఎల్లవేళలా అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. మీరంతా మున్ముందు కూడా ఇలాగే  మీ ప్రేమను చూపిస్తారని ఆశిస్తున్నా. మంగళవారం దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఈ సిరీస్‌లో శుభారంభం చేయాలని కోరుకుంటున్నాను’’ అని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ చెప్పుకొచ్చాడు. కాగా, స్టోక్స్‌ మొత్తం 104 వన్డేలాడి 89 ఇన్నింగ్స్‌ల్లో 2,919 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, 21 అర్ధ శతకాలు సాధించాడు. మరోవైపు బౌలింగ్‌లో 74 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని