IND vs SA: సఫారీపై సెంచరీతో సూర్య రికార్డు.. సిరీస్‌లో ‘ఇంపాక్ట్‌ ఫీల్డర్‌’ ఎవరంటే?

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను భారత్ 1-1తో ముగించింది. కీలకమైన మూడో మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి విజయం సాధించింది.

Published : 15 Dec 2023 12:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో (IND vs SA) భారత కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్ సూపర్‌ సెంచరీ సాధించి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గత వరల్డ్‌ కప్‌లో ఇచ్చినట్లుగానే.. ఈ సిరీస్‌లోనూ అత్యుత్తమ ఫీల్డింగ్‌ చేసిన ఆటగాడికి  ‘ఇంపాక్ట్‌ ఫీల్డర్’ అవార్డును మేనేజ్‌మెంట్ బహూకరించింది. ఈ సందర్భంగా ఫీల్డింగ్‌ కోచ్‌తోపాటు అవార్డు గ్రహీత ప్రత్యేకంగా మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఇక రెండో టీ20 మ్యాచ్‌లో నమోదైన రికార్డుల గురించి తెలుసుకుందాం.. 

ప్రతి ఒక్కరూ అద్భుతమే.. కానీ సిరాజ్‌కే అవార్డు: దిలీప్‌

‘‘మనం వరల్డ్‌ కప్‌ సందర్భంగా ప్రవేశపెట్టిన ‘బెస్ట్‌ ఫీల్డర్’ ఎంపిక సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. అయితే, మ్యాచ్‌కు కాకుండా.. సిరీస్‌ మొత్తానికి కలిపి ‘ఇంపాక్ట్‌ ఫీల్డర్‌’ ఇవ్వాలని భావించాం. జట్టులోని ప్రతి ఆటగాడూ అత్యుత్తమ ఫీల్డింగ్‌ ప్రదర్శన చేశారు. దక్షిణాఫ్రికాకు వచ్చాక వర్షం కారణంగా ప్రాక్టీస్‌ కూడా ఎక్కువగా చేయలేకపోయాం. అయినా, యువ ఆటగాళ్లు పరిస్థితులకు చక్కగా అలవాటుపడ్డారు. రింకు సింగ్‌, యశస్వి జైస్వాల్, మహమ్మద్‌ సిరాజ్‌ ‘ఇంపాక్ట్‌’ రేసులో నిలిచారు. కేవలం ఒక్క మ్యాచ్‌ కాకుండానే.. సిరీస్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశారు. వరల్డ్‌ కప్‌ నుంచి మెరుగైన ఫీల్డింగ్‌ను కొనసాగిస్తూ వచ్చిన సిరాజ్‌కు ‘ఇంపాక్ట్‌ ఫీల్డర్‌’ అవార్డు ఇస్తున్నాం’’ అని భారత ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ వెల్లడించాడు. మెడల్‌ను అందుకున్న సిరాజ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. చివరి టీ20లో డైరెక్ట్‌ త్రో విసిరి దక్షిణాఫ్రికా బ్యాటర్‌ను మియాభాయ్‌ రనౌట్‌ చేశాడు.

సూర్యకుమార్‌ రికార్డు ‘సెంచరీ’

టీ20ల్లో టాప్‌ ర్యాంకర్‌గా కొనసాగుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ సిరీస్‌లోనూ తన ఫామ్‌ను కొనసాగించాడు. టీ20ల్లో నాలుగో శతకం సాధించిన సూర్యకుమార్‌.. రోహిత్ శర్మ (4), గ్లెన్‌ మాక్స్‌వెల్ (4) సరసన చేరాడు. మూడు లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌ సూర్యకుమార్‌ కావడం విశేషం. అతడి నాలుగు సెంచరీలు అలా సాధించినవే. టీ20ల్లో కెప్టెన్‌గా ఉంటూ సెంచరీ చేసిన రెండో భారత సారథి సూర్యకుమార్‌ యాదవ్‌. అంతకుముందు రోహిత్ శర్మ (118, 111*) రెండు శతకాలు బాదాడు. అయితే, విదేశాల్లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా సూర్య రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

  • టీ20ల్లో ఎక్కువ సిక్స్‌లు బాదిన రెండో బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్. అతడు కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే 123 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్‌ల్లో 182 సిక్స్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 
  • టీ20ల్లో హిట్‌ వికెట్‌గా పెవిలియన్‌కు చేరిన ఐదో భారత బ్యాటర్ జితేశ్‌ శర్మ. దక్షిణాఫ్రికాతో చివరి ఓవర్‌లో ఈ విధంగా ఔటయ్యాడు. ఇప్పటి వరకు కేఎల్ రాహుల్, హర్షల్‌ పటేల్, హార్దిక్‌ పాండ్య, శ్రేయస్‌ అయ్యర్‌ ఇలా పెవిలియన్‌కు చేరారు.
  • టీ20ల్లో భారీ వ్యత్యాసంతో దక్షిణాఫ్రికా ఓడిపోవడం ఇది మూడో సారి. ఇప్పుడు భారత్‌ చేతిలో 106 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇదే ఏడాది డర్బన్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులు, జొహానెస్‌బర్గ్‌లో ఆసీస్‌తోనే మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓడింది. 
  • టీ20ల్లో దక్షిణాఫ్రికా అత్యల్ప స్కోర్ల జాబితాలో ఇది రెండో మ్యాచ్‌. జొహానెస్‌బర్గ్‌ వేదికగా 2020లో ఆసీస్‌పై 89 పరుగులకే సఫారీ జట్టు కుప్పకూలింది. తాజాగా 95 పరుగులకే ఆలౌటైంది. 
  • భారత్‌ అత్యధిక తేడాతో విజయం సాధించిన మ్యాచుల్లో ఇది మూడోది. ఈ ఏడాది అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌పై 168 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. డబ్లిన్‌ వేదికగా (2023లో) ఐర్లాండ్‌ను 143 పరుగుల తేడాతో చిత్తు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు