IND vs AUS: ‘భారత్‌ను భారత్‌లో ఓడించడం దాదాపు అసాధ్యం’

భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌కు ఆస్ట్రేలియా సరైన విధంగా సన్నద్ధం కాలేదని పాక్‌ మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రజా (Ramiz Raja) అన్నాడు. 

Published : 21 Feb 2023 01:16 IST

ఇంటర్నెట్ డెస్క్:  నాలుగు టెస్టుల బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భారత్‌  2-0 ఆధిక్యంలో నిలిచింది. నాగ్‌పూర్‌, దిల్లీలో జరిగిన రెండు టెస్టుల్లోనూ ఆసీస్‌పై టీమ్ఇండియా (Team India) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటతీరు గురించి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు మాజీ అధ్యక్షుడు రమీజ్‌ రజా (Ramiz Raja) మాట్లాడాడు. భారత్‌లో భారత్‌ను ఓడించడం అసాధ్యమని, ఆ సవాలును ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా తగినంతగా సన్నద్ధం కాలేదన్నాడు. తొలి టెస్టుకు ముందు పాట్ కమిన్స్ ఆసీస్‌ కనీసం రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సిందని పేర్కొన్నాడు.  

‘భారత్‌లో మంచి టెస్ట్ క్రికెట్ ఆడటానికి ఆసీస్‌ సరిగ్గా సన్నద్ధం కాలేదని వారి ఆటతీరును బట్టి చూస్తే అర్థమవుతోంది. భారత్‌లో టీమ్‌ఇండియాను ఓడించడం దాదాపు అసాధ్యం. స్పిన్‌ బౌలింగ్‌లో ఆసీస్‌ బ్యాటర్లు పేలవంగా ఆడుతున్నారు. రెండో టెస్టులో సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఒకే సెషన్‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయింది. జడేజా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అక్షర్‌ పటేల్ బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చాడు. అశ్విన్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పి ఆసీస్‌ ఆధిక్యాన్ని తగ్గించాడు. ఆస్ట్రేలియా మానసికంగా బలంగా లేదు. వారి ఆటతీరులో సాంకేతిక లోపాలు ఉన్నాయి. సరైన షాట్లు ఆడలేదు. స్వీప్ షాట్‌లు ఆడుతూనే ఉన్నారు’ అని రమీజ్‌ రజా అన్నాడు. మార్చి 1 నుంచి భారత్‌, ఆసీస్‌ మధ్య ఇండోర్ వేదికగా మూడో టెస్టు ప్రారంభంకానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని