Chennai Superkings - IPL: కింగ్స్‌.. వేటకు వస్తున్నారు

అయిదుసార్లు ఛాంపియన్‌, రెండు సార్లు మినహా ప్రతీసారీ ఫేఆప్స్‌, ధోని లాంటి మేటి నాయకుడు. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఉన్న ఆకర్షణ అంతా ఇంతా కాదు.

Updated : 21 Mar 2024 09:58 IST

అయిదుసార్లు ఛాంపియన్‌, రెండు సార్లు మినహా ప్రతీసారీ ఫేఆప్స్‌, ధోని లాంటి మేటి నాయకుడు. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (IPL)లో చెన్నై సూపర్‌కింగ్స్‌ (Chennai Super kings)కు ఉన్న ఆకర్షణ అంతా ఇంతా కాదు. ఎప్పటిలాగే ఈ సీజన్‌లోనూ భారీ అంచనాలున్న ఈ డిఫెండింగ్‌ ఛాంపియన్‌.. మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరి చెన్నై ఆరో టైటిల్‌ సాధిస్తుందా?

ఈనాడు క్రీడావిభాగం

ధోని సారథ్యంలో చెన్నై ఐపీఎల్‌లో అత్యంత నిలకడైన జట్టు. ఏకంగా పది సార్లు ఫైనల్‌ చేరి అయిదు టైటిళ్లు సాధించిన సీఎస్కే.. మరో ట్రోఫీ లక్ష్యంగా ఈసారి బరిలోకి దిగుతోంది. గత ఐపీఎల్‌తోనే రిటైరవుతాడని అంతా భావించిన ధోని కనీసం ఈ సీజన్‌కు కొనసాగుతుండడం అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే విషయమే. ఈసారి విజేతగా నిలిస్తే  చెన్నై జట్టు.. ముంబయి ఇండియన్స్‌ను అధిగమించి ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంఛైజీగా నిలుస్తుంది. శుక్రవారం బెంగళూరుతో పోరుతో చెన్నై తన టైటిల్‌ వేటను ఆరంభిస్తుంది.

బలాలు: ఎప్పటిలాగే సూపర్‌కింగ్స్‌ అతి పెద్ద బలం ఆ జట్టు కెప్టెన్‌ ధోనీనే. సారథిగా, బ్యాటర్‌గా అతడి సామర్థ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. జట్టుకు అతడు పెద్ద భరోసా. ఇక చెన్నై బ్యాటింగ్‌ చాలా బలంగా ఉంది. రచిన్‌ రవీంద్ర, రుతురాజ్‌, డరిల్‌ మిచెల్‌, శివమ్‌ దూబె, జడేజా, మొయిన్‌ అలీ, రహానె వంటి వారితో లైనప్‌ చాలా లోతుగా, దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఆఖర్లో వచ్చే దీపక్‌ చాహర్‌ కూడా బ్యాట్‌ ఝళిపించగలడు. వేలంలో రూ.8.40 కోట్లకు కొనుక్కున్న 20 ఏళ్ల విధ్వంసక మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ సమీర్‌ రిజ్వీ కూడా జట్టులో ఉన్నాడు. శార్దూల్‌ ఠాకూర్‌ కూడా బ్యాటుతో ప్రత్యర్థి పనిపట్టగలడు. సూపర్‌కింగ్స్‌ బౌలింగ్‌ అద్భుతం కాదు. కానీ.. చెన్నైలోని పిచ్‌ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకునే బౌలర్లు ఆ జట్టులో ఉన్నారు.

చెపాక్‌లో మందకొడి పిచ్‌పై సగం లీగ్‌ మ్యాచ్‌లు ఆడనుండడం ఎప్పటిలాగే చెన్నైకి పెద్ద సానుకూలాంశం. పరుగులు చేయడం కష్టమైన పిచ్‌పై ప్రత్యర్థిని కట్టిపడేయడానికి జడేజా, మొయిన్‌ అలీ, శాంట్నర్‌ రూపంలో మంచి స్పిన్నర్లు చెన్నైకి ఉన్నారు. ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్లు మరోసారి కీలక పాత్ర పోషించనున్నారు. పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు తీక్షణ రూపంలో మరో స్పిన్నర్‌ చెన్నైకి ఉన్నాడు. దీపక్‌ చాహర్‌, తుషార్‌ దేశ్‌పాండే, ముకేశ్‌ చౌదరి, హంగార్గేకర్‌లతో కూడిన పేస్‌ విభాగం శార్దూల్‌ ఠాకూర్‌ చేరికతో బలపడనుంది. రచిన్‌ రవీంద్ర కూడా బంతితో సత్తా చాటగలడు. తెలుగుకుర్రాళ్లు అవనీశ్‌ రావు, షేక్‌ రషీద్‌    చెన్నై జట్టులో సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

బలహీనతలు: కీలక ఓపెనింగ్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే గాయం కారణంగా కనీసం సగం మ్యాచ్‌లకు దూరం కానుండడం చెన్నైకి ఇబ్బంది కలిగించే అంశమే. నిరుడు ఐపీఎల్‌లో అతడు  16 మ్యాచ్‌ల్లో 51.69 సగటుతో 672 పరుగులు చేశాడు. శివమ్‌ దూబె ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఎక్కువగా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేదు. నిరుడు విశేషంగా రాణించిన రహానె పేలవ ఫామ్‌లో ఉన్నాడు. 2023 ఐపీఎల్‌ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ధోని ఎలా ఆడతాడో చూడాలి. కీలక ఫాస్ట్‌బౌలర్‌ పతిరన గాయం కారణంగా టోర్నమెంట్‌ తొలి అర్ధభాగానికి దూరమయ్యే సూచనలుండడం సూపర్‌కింగ్స్‌ బౌలింగ్‌ను బలహీనపరిచేదే. అతడి గైర్హాజరీలో ఆఖరి ఓవర్లలో బ్యాటర్లను కట్టిపడేసే మరో పేసర్‌ చెన్నైకి కనపించట్లేదు. బంగ్లా పేసర్‌ ముస్తాఫిజుర్‌ జట్టులో ఉన్నా.. ఇటీవల శ్రీలంకతో వన్డే సందర్భంగా అతడూ గాయం కారణంగా ఇబ్బందిపడ్డాడు. నడవలేకపోవడంతో అతణ్ని స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. టోర్నీ కోసం భారత్‌కు వచ్చిన అతడు  ఎంత ఫిట్‌గా ఉన్నాడు అన్నది ప్రశ్న!

స్వదేశీ ఆటగాళ్లు

ధోని, జడేజా, శివమ్‌ దూబె, శార్దూల్‌ ఠాకూర్‌, హంగార్గేకర్‌, నిశాంత్‌ సింధు, అజయ్‌ మండల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రహానె, షేక్‌ రషీద్‌, సమీర్‌ రిజ్వీ, అవనీష్‌ రావు, దీపక్‌ చాహర్‌, తుషార్‌ దేశ్‌పాండే, ప్రశాంత్‌ సోలంకి, సిమర్‌జీత్‌ సింగ్‌, ముకేశ్‌ చౌదరి

విదేశీయులు: రచిన్‌ రవీంద్ర, డరిల్‌ మిచెల్‌, మొయిన్‌ అలీ, శాంట్నర్‌, తీక్షణ,  పతిరన, ముస్తాఫిజుర్‌.

కీలక ఆటగాళ్లు: ధోని, జడేజా, మొయిన్‌ అలీ, రచిన్‌ రవీంద్ర

అత్యుత్తమ ప్రదర్శన: 2010, 2011, 2018, 2021, 2023 విజేత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు