AUS vs SA: మ్యాచ్‌కు ముందు క్రికెటర్‌కి కరోనా.. క్రికెట్‌ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌(AUS vs SA) సందర్భంగా ఆసీస్‌ జట్టు క్రికెటర్‌కి కరోనా అని తేలింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.  

Published : 04 Jan 2023 17:45 IST

సిడ్నీ: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య చివరి టెస్టు మ్యాచ్‌ సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆసీస్‌ జట్టు ఆటగాడు మాథ్యూ రెన్‌షా(Matthew Renshaw) కరోనా బారిన పడ్డాడు. సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్‌ బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాస్‌ వేయడానికి ముందు మాథ్యూ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడికి అక్కడే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. అయినప్పటికీ తమ ఆటగాడు మ్యాచ్‌లో పాల్గొంటాడని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) తెలపడం గమనార్హం. 

దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మాథ్యూ టెస్టు సిరీస్‌లో ఆడుతున్నాడు. కరోనా(Carona Virus) పాజిటివ్‌గా తేలడంతో అతడు జట్టు నుంచి దూరంగా ఉంటూ మ్యాచ్‌లో పాల్గొనాల్సివచ్చింది. ‘‘ఇప్పటివరకు మా జట్టులో ఒక్కరు కూడా వైరస్‌ బారిన పడకపోవడం ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ వ్యాఖ్యానించిన కొంత సమయానికే ఈ వార్త బయటకు రావడం విశేషం. 

‘‘ప్రస్తుతం పరిస్థితులన్నీ సాధారణంగా మారినట్టుగా అనిపిస్తోంది. కుటుంబాలతో కలిసి క్రిస్మస్‌ వేడుకలకు హాజరవ్వగలుగుతున్నాం. ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం. మునుపటి రోజులు తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తోంది’’ అంటూ కమిన్స్‌ ఓ సందర్భంలో వ్యాఖ్యానించాడు. అయితే, ఇలా కరోనా సోకినా మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొనడం ఇది మొదటిసారి ఏమీ కాదు. గతేడాది కామన్‌వెల్త్‌ గేమ్స్‌ మహిళల క్రికెట్‌ ఫైనల్‌లోనూ ఇదే జరిగింది. ఆసిస్‌ స్టార్‌ తహ్లియా మెక్‌గ్రాత్‌ సైతం పాజిటివ్‌ అని తేలినా మ్యాచ్‌లో పాల్గొనింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని