David Warner: టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్‌.. అదే ఆఖరు సిరీస్

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ (David Warner) మరికొన్ని నెలల్లో టెస్టు కెరీర్‌కు ముగింపు పలకనున్నాడు. 2024 జనవరిలో పాకిస్థాన్‌తో జరిగే టెస్టు సిరీస్ తన కెరీర్‌ చివరదని అతడు వెల్లడించాడు.

Published : 03 Jun 2023 18:41 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ (David Warner) టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024 జనవరిలో పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ చివరిదని ప్రకటించాడు. ఈ నెల 7న భారత్‌, ఆసీస్‌ (IND vs AUS) మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final) ఫైనల్‌ ప్రారంభంకానుంది.  ఈ సందర్భంగా వార్నర్ విలేకరులతో మాట్లాడుతూ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్‌తో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాలనుకుంటున్నట్లు వార్నర్‌ చెప్పాడు. పాకిస్థాన్‌తో సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా వెస్టిండీస్‌తో ఆడుతుంది. అయితే, ఆ సిరీస్‌లో ఆడబోనని వార్నర్ స్పష్టం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌తోపాటు యాషెస్‌ సిరీస్‌లో తుదిజట్టులో చోటు దక్కడం కోసం మెరుగైన ప్రదర్శన చేస్తానని పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆసీస్‌ ఎంపిక చేసిన జట్టులో వార్నర్‌ ఉన్న విషయం తెలిసిందే. 

వన్డేలకు రిటైర్మెంట్ ఎప్పుడంటే? 

ఇక నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు వార్నర్ వివరించాడు. 2024 ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటున్నానని చెప్పిన అతడు.. తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని సూచనాప్రాయంగా చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌ మాత్రం ఆడతానని చెప్పాడు. వార్నర్‌ టెస్టు కెరీర్‌ విషయానికొస్తే ఇప్పటివరకు 103 మ్యాచ్‌లు ఆడి 45.57 సగటుతో 8,158 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని