IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. ఓపెనర్‌గా గిల్ వద్దు: సునీల్ గావస్కర్

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో (IND vs SA) భాగంగా తొలి మ్యాచ్‌ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సునీల్ గావస్కర్ తన తుది జట్టును ప్రకటించాడు.

Published : 25 Dec 2023 02:08 IST

ఇంటర్నెట్ డెస్క్: డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికా  - భారత్ జట్ల మధ్య (SA vs IND) తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మకు జోడీగా శుభ్‌మన్‌ గిల్‌ కాకుండా యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా పంపించాలని టీమ్ఇండియా క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్ తెలిపాడు. ‘‘వన్‌డౌన్‌లో శుభ్‌మన్‌ గిల్‌. టెస్టుల్లో కీలకమైన విరాట్ కోహ్లీని సెకండ్‌ డౌన్‌లో పంపించాలి. కేఎల్ రాహుల్ వికెట్‌ కీపింగ్‌ చేయాలి. శ్రేయస్‌ అయ్యర్‌ మిడిలార్డర్‌లో ఆడాలి. వారిద్దరూ పరిస్థితిని బట్టి ముందూ వెనుకా ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తారు. రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకోవాలి. పేస్‌ విభాగం మాత్రం బుమ్రా, సిరాజ్‌తోపాటు ముకేశ్‌ కుమార్‌ను మూడో ఫాస్ట్‌ బౌలర్‌గా ఎంపిక చేస్తున్నా’’ అని గావస్కర్‌ వెల్లడించాడు. 

కేఎల్ రాహుల్‌ వికెట్‌ కీపర్‌గా రాణిస్తాడు: గంభీర్‌

టెస్టుల్లో వికెట్ల వెనుక బంతిని కాచుకోవడం చాలా కష్టమైన పనే. ఓపికగా కీపింగ్‌ చేయాల్సి ఉంటుంది. బంతిలో వైవిధ్యం ఎక్కువగానూ ఉండటం వల్ల ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండాలి. చాలా రోజుల తర్వాత టెస్టుల్లో వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలను కేఎల్ రాహుల్‌ చేపట్టబోతున్నాడు. అయితే, కేఎల్‌ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాడని భావిస్తున్నట్లు గౌతమ్ గంభీర్‌ వ్యాఖ్యానించాడు. ‘‘కేఎల్ రాహుల్‌కు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో పెద్ద సవాళ్లు ఎదురుకాకపోవచ్చు. రాణిస్తాడనే నమ్మకం ఉంది. కానీ, అసలైన పరీక్ష మాత్రం ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లోనే ఎదురుకానుంది. రిషభ్‌ పంత్‌ వచ్చే వరకు కేఎల్‌తోనే కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తించేలా చేయడం మంచిదే. ఒకవేళ ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు పంత్‌ అందుబాటులో లేకపోతే కేఎల్‌నే వికెట్‌ కీపర్‌గా కొనసాగించొచ్చు’’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని