Team India: టీమ్‌ఇండియాలో ఆ ఇద్దరు ‘జెంటిల్‌మెన్‌’: బీసీసీఐ ఏసీయూ మాజీ చీఫ్‌ నీరజ్‌ కుమార్

భారత జట్టుతో తనకున్న అనుబంధంపై దిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్‌ కుమార్‌ స్పందించారు. బీసీసీఐ యాంటీ కరప్షన్‌ యూనిట్‌కు ఆయన చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

Updated : 08 Apr 2024 13:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బీసీసీఐ యాంటీ కరప్షన్‌ యూనిట్‌ చీఫ్‌గా ఉన్నప్పుడు తనతో క్రికెటర్లు ఎంతో మర్యాదగా ఉండేవారని దిల్లీ మాజీ పోలీసు కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ వెల్లడించారు. క్రికెట్‌ బోర్డులో అవినీతి లేకుండా చేయడానికి బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దానికి చీఫ్‌గా నీరజ్‌ 2015-2018 వరకు వ్యవహరించారు. తాజాగా తన హయాంలో భారత ఆటగాళ్లతో సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ (Virat Kohli) ‘వర్క్‌ ఎథిక్స్‌’ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాయని తెలిపారు.

‘‘చాలా మంది క్రికెటర్లతో తరచూ మాట్లాడేవాడిని. అవినీతి నిరోధక శాఖ కావడంతో ప్రతి విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా గౌరవించారు. ఇద్దరు మాత్రం ఎక్కువగా మాట్లాడేవారు కాదు. భువనేశ్వర్‌ కుమార్‌, అజింక్య రహానె అద్భుతమైన ఆటగాళ్లు. వారిని జెంటిల్‌మెన్‌ అనడంలో సందేహం లేదు. ఆటపట్ల నిబద్ధత విషయంలో విరాట్ కోహ్లీ టాప్‌. అతడి ట్రైనింగ్‌ కూడా ఇతర క్రికెటర్లకు ఆదర్శం. కొంతమంది తమ స్థానిక భాషలో మాట్లాడుతుంటారు. కొన్ని పదాలు అసభ్యంగా అనిపించినా.. అవేవీ పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని తెలిపారు.

క్రోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ దర్యాప్తులోనూ.. 

ఐపీఎస్ అధికారి అయిన నీరజ్‌ కుమార్‌ 37 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పని చేశారు. స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్, చండిలా, అంకిత్‌ చవాన్‌లను అరెస్ట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించారు. శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏడేళ్లకు శిక్షను కుదించింది. 2020లో అతడిపై నిషేధం వైదొలిగింది. సరైన ఆధారాలున్నా తగిన చట్టం లేకపోవడం వల్లే శ్రీశాంత్ తప్పించుకున్నాడని నీరజ్‌ కుమార్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రీడల్లో అవినీతి నిరోధానికి చట్టం అవసరమని అభిప్రాయపడ్డారు. 2000లోనే దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హ్యాన్సీ క్రోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసు సీబీఐ దర్యాప్తులో కూడా ఈ అధికారి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని