WI vs IND: అతడిని తీసుకోకపోవడానికి కారణమేంటో చెప్పాల్సిందే: టీమ్‌ఇండియా మాజీలు

విండీస్‌ పర్యటనకు భారత జట్టు (WI vs IND) ఎంపికపై విమర్శలు వచ్చాయి. దేశవాళీలో రాణించిన వారికి అవకాశం ఇవ్వకపోవడంతో మాజీలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 24 Jun 2023 15:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జులై 12 నుంచి విండీస్‌ పర్యటన (WI vs IND) ప్రారంభం కానుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకకటించింది. అయితే, టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులోకి దేశవాళీ నాణ్యమైన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ 79.65 సగటుతో డొమిస్టిక్‌ క్రికెట్‌లో అదరగొట్టాడు. ఈ క్రమంలో అతడిని ఎంపిక చేయకపోవడంపై టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. అతడిని తీసుకోకపోవడానికిగల కారణాలను సెలక్షన్ కమిటీ వెల్లడించాలన్నాడు. టీమ్‌ ఎంపికపై తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా విశ్లేషించాడు.

‘‘గత మూడేళ్లుగా సర్ఫరాజ్‌ గణాంకాలను ఓ సారి చూడండి. అతడు ఇంకేం చేయాలి?డొమెస్టిక్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ రాణిస్తున్నాడు. అతడిని ఎంపిక చేయకుండా ఏం సందేశం ఇస్తారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఒకవేళ ఇతర కారణం ఉంటే అదేంటో ప్రజలకు చెప్పాలి. సర్ఫరాజ్‌ ఖాన్ ప్రదర్శనలో ఫలానా విషయం నచ్చలేదని వెల్లడించాలి. అతడిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. ఒకవేళ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ పరుగులకు విలువ లేకపోతే.. వదిలేయండి’’ అని చోప్రా వ్యాఖ్యానించాడు.

వారు ఐపీఎల్‌ ఆడలేదు.. : జాఫర్‌

వెస్టిండీస్‌ పర్యటనకు జట్టు ఎంపికపై వసీం జాఫర్‌ పెట్టిన ట్వీట్ వైరల్‌గా మారింది. ట్వీట్‌లోని అంశాలివీ..

1. నలుగురు ఓపెనర్ల అవసరం ఏంటి? దానికి బదులుగా సర్ఫరాజ్‌ ఖాన్‌ను తీసుకుంటే మిడిలార్డర్‌లో అక్కరకొస్తాడు. దేశవాళీలో నిలకడైన ఆటతీరు ప్రదర్శించాడు.

2. ఈశ్వరన్‌, పంచల్‌ కూడా రంజీ ట్రోఫీలోనూ, భారత్‌ A జట్టు తరఫున రాణించారు. చాలా రోజులుగా టెస్టుల్లోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే, వారు ఐపీఎల్‌ ఆడలేదు. అందుకే వారిని పరిగణనలోకి తీసుకోలేదా? రుతురాజ్‌ ముందుకు ఎలా వచ్చాడు?

3. షమీకి విశ్రాంతి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. దాదాపు నెల రోజులపాటు విరామం వచ్చినప్పటికీ విశ్రాంతి ఇచ్చారు. అతడి ఫామ్‌ను బట్టి తప్పకుండా జట్టులో ఉండాల్సిన బౌలర్.

సంజూకు మంచి అవకాశం: ఇర్ఫాన్‌ 

రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్‌ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వికెట్‌ కీపర్‌గా విండీస్‌ పర్యటనకు ఎంపికైన సంజూ శాంసన్‌ మరింతకాలం వన్డే క్రికెట్‌ ఆడే అవకాశం ఉందని భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్వీట్ చేశాడు. ‘‘పంత్ ఇంకా రికవరీ అవుతూనే ఉన్నాడు. సంజూ శాంసన్‌కు వన్డే క్రికెట్‌లో మరింతకాలం కొనసాగేందుకు మంచి అవకాశం వచ్చింది. మిడిల్‌ఆర్డర్‌లో కీలకంగా మారతాడు. విండీస్‌తో సిరీస్‌లో రాణిస్తాడనే నమ్మకం ఉంది’’ అని పోస్టు పెట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని